ఆకాశంలో ఉండగా విమానం డోర్ తెరిచే యత్నం
* ఆందోళన చెందిన ప్రయాణికులు
* హైదరాబాద్ కు చెందిన జిమ్ ట్రైనర్‌పై కేసు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గగనతలంలో విమానం వెళ్తుండగా అకస్మాత్తుగా తలుపులు తీయబోయాడో ప్రయాణికుడు. దీంతో మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అరుపులు కేకలు పెట్టడంతో విమాన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ ఈనెల 21న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానంలో వస్తున్నాడు. ఏమైందో ఏమో.. అతడు మిగతా ప్రయాణికులతో పాటు విమానంలో ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా గగనతలంలో విమానం తలుపులు తెరిచేందుకు యత్నించాడు. దాంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అతడిపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తరువాత భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 258, 336, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకవేళ విమానం తలుపులు తెరుచుకుంటే పెను ప్రమాదం జరిగేది.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
