Ponnam Prabhakar
* కార్మికులకు పొన్నం ప్రభాకర్ హామీ
Ponnam Prabhakar: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో దాదాపు పదేళ్ల తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో కార్మికులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 2016 జూలై 19న చివరిసారిగా ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను పునరుద్ధరిస్తూ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
* విలీనంలో కార్మికుల భాగస్వామ్యం
గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై తదుపరి ప్రక్రియ చేపడతామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వాములను చేసి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థల విలీనం తర్వాత ఎదురైన సమస్యలను అధ్యయనం చేసి, తెలంగాణలో అలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
* కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం
ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ డీఏలు, ఫిట్మెంట్, సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపులతో పాటు 1,432 కారుణ్య నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. గతంలో సర్వీసు నుంచి తొలగించిన 250 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. కార్మికుల పని భారాన్ని తగ్గించేందుకు 4,000 ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చామని, సంస్థను బలోపేతం చేసేందుకు 2,932 కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతనాలు, పని భారం వంటి అంశాలపై వారి ప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
