* నేడు తేలనున్న భవితవ్యం
* సునాక్ కు కష్టమే అంటున్న ఒపీనియన్ పోల్స్
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ దేశ ప్రధానిగా కొనసాగుతున్న రిషి సునాక్ (Rishi Sunak) పోటీలో ఉండడంతో ఆ దేశ ఎన్నికలపై భారతపౌరులు కూడా ఆసక్తి చూపుతున్నారు. సునాక్ భవితవ్యాన్ని తేల్చే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల సమరం ఈరోజే మొదలైంది. ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. బ్రిటన్లోని స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
——————————