ఆకేరు న్యూస్, ములుగు:మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలసి ఉదయం 10.00 గంటలకు “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు, భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఆవరణం లోని కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
