*రూల్స్ బ్రేక్ చేస్తే వాహనం సీజ్!
*మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ చెకింగ్ షురూ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి విధుల్లో రాజీలేని కఠిన చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని టార్గెట్ చేస్తూ ప్రత్యేక ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నారు.
తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే!
రోడ్డుపైకి వాహనం తీసే ప్రతి ఒక్కరూ తమ వద్ద కచ్చితంగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్స్ (m-Parivahan/ DigiLocker) లోని డిజిటల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ రెండూ లేని పక్షంలో పోలీసులు భారీ జరిమానాలు విధించడమే కాకుండా, అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వాహన యజమానులకు రిస్క్ తప్పదు..చాలామంది తమ పిల్లలకు లేదా లైసెన్స్ లేని మిత్రులకు వాహనాలు ఇస్తుంటారు. ఇకపై అలా చేస్తే యజమానులే చిక్కుల్లో పడతారు.
లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే, దానికి యజమానినే బాధ్యుడిగా పరిగణిస్తారు.
అంతేకాకుండా, అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. దీనివల్ల ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, వెంటనే మీ లైసెన్స్ గడువును తనిఖీ చేసుకోండి. ఒకవేళ లైసెన్స్ లేకపోతే తక్షణమే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. నిబంధనలు పాటించి, సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని అధికారులు కోరుతున్నారు.
