Jana Nayagan Release on July 23, 2026
* థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే
ఆకేరు న్యూస్, డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి ‘ధళపతి’ విజయ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా సెన్సార్ వివాదాలు, వాయిదాల నేపథ్యంలో సందిగ్ధంలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 23న (జులై 23) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
నిజానికి ఈ చిత్రం జులై 24న విడుదలవుతుందని గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. మేకర్స్ ఒక రోజు ముందే, అంటే జులై 23నే సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను పంచుకుంటూ మేకర్స్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. “అగ్నిపరీక్షలు ఎదుర్కొని.. కాలంతో చెక్కబడి.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. పోరాటం ఎంత కఠినమైనదైతే.. విజయపు కేరింతలు అంత గొప్పగా ఉంటాయి” అంటూ పవర్ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సెన్సార్ చిక్కులు దాటుకుని, విడుదల తేదీ ఖరారు కావడంతో విజయ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
తెలుగులో ఈ సినిమా ‘జన నాయకుడు’ అనే పేరుతో విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్ విలన్‌గా అలరించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
