Free Stationery Distribution Program
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 21 మంది నిరుపేద విద్యార్థులకు పూసాల వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. సుమారు రూ 35,000 విలువైన పాఠశాల దుస్తులు, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, గైడ్స్, ఇతర స్టేషనరీ వస్తువులను విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పూసాల ప్రకాశం మాట్లాడుతూ, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ ఫౌండేషన్ ద్వారా 20 మందికి పైగా అర్హులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి, వారికి అవసరమైన విద్యా సామాగ్రిని అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. వాణి ,జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాల ఇన్చార్జి ఆకారపు రాజేందర్ , మహేంద్రకర్ బాల కిషన్, గూడూరి లక్ష్మినారాయణ, రావుల రమేష్, పూసాల శ్రీనివాస్ లతో పాటు గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
