![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-1-4.jpg)
* తెలుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్
* లక్షలాదిగా చనిపోతున్న కోళ్లు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు ఇప్పుడు కొత్త వైరస్ సోకింది. లక్షలాదిగా చనిపోతున్నాయి. ఆ వైరస్ ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా అంతుచిక్కడం లేదు. ఈ కలవరంతో చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. చికెన్, గుడ్లు తినొచ్చా.. లేదా తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వ్యాధి కోళ్లకు ఎక్కువగా సోకింది. దాదాపు 4 లక్షలకు పైగా కోళ్లు ప్రభావితమయ్యాయి. సమాచారం అందుకున్న పశువైద్య శాఖ అధికారులు కోళ్ల ఫారాలలో తనిఖీలు నిర్వహించారు. కోళ్ల నుండి రక్త నమూనాలను సేకరించి విజయవాడ, భోపాల్లోని పరీక్షా కేంద్రాలకు పంపారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఆ వైరస్ ఏంటి?
అయితే.. కోళ్లకు వచ్చిన వైరస్ ఏంటనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారులు ఇది H15N వైరస్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. టీకాలు లేకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. గుడ్లు పెట్టిన నిమిషాల్లోనే కొన్ని కోళ్లు చనిపోయాయని రైతులు తెలిపారు. ఈ వైరస్ ఇతర కోళ్లలో వేగంగా వ్యాపించి, కోళ్ల పెంపకందారులకు పెద్ద నష్టాన్ని కలిగించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో డిసెంబరు నుంచి ఇప్పటి వరకు.. రెండు నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోయినట్లు చెబుతున్నారు. కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండడంతో షెడ్లు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఇంకా వైరస్ సోకక.. మిగిలి ఉన్న ఫారాల్లో కోళ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
చికెన్.. తినొచ్చా లేదా..?
చనిపోతున్న కోళ్లను అధికారులు సురక్షితంగా పూడ్చిపెడుతున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కోళ్లు చనిపోతుండడంతో చాలా మంది ప్రజలు చికెన్ తినవచ్చా? లేదా? అన్న అనుమానాలతో వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే కోళ్లు చనిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు చికెన్, గుడ్లు తినేందుకు వెనకాడుతుండడంతో దీనిపై నిపుణులు స్పందించారు. చికెన్, గుడ్లను తినడం వల్ల ఎవరికీ అనారోగ్యం సంభవించలేదని కొందరు పేర్కొంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు కోళ్ల మాంసం తినకూడదని మరికొందరు చెబుతున్నారు. కాగా, పెరవలి మండలంలోని కానూరు అగ్రహారంలో అధికారులు 80 కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని భోపాల్ కేంద్రీయ ప్రయోగశాలకు పంపించారు. కాగా, ఈ వైరస్ ప్రభావం పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది.
………………………………………..