పెరుమాండ్ల రామకృష్ణ
* సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
* పెరుమాండ్ల రామకృష్ణ
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా. పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా డా. పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటు ఎంతో విలువైనదని అన్నారు. ఓటు హక్కును, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించిన ఆయన, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్య మూలాలను, లౌకిక స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యత, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని డా. పెరుమాండ్ల రామకృష్ణ పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

