* పంపకాల్లో మార్మోగుతున్న జూబ్లీహిల్స్ పేరు
* అందరికీ లెక్క అందేలా అభ్యర్థుల ప్రణాళికలు
* పేర్లు, ఫోను నంబర్లు తీసుకుని మరీ పంపకాలు
* ఓటు గుర్తింపుకార్డు, ఆధార్ వెంట ఉండాల్సిందే
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మాటల తూటాలు పేలడమే కాదు.. నోట్ల కట్టలూ హల్చల్ చేస్తున్నాయి. బహిరంగంగానే పంపకాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అధికారులు, పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లేలోగా ష్.. గప్ చుప్.. అంటూ పంపకాలకు విరాళాలు ఇస్తూ పరిస్థితి సద్దుమణిగిన వెంటనే మళ్లీ మొదలుపెడుతున్నారు. ఓటుకు రూ.2500 పక్కా.. లక్ష మంది లెక్కగా భావించి ఓ ప్రధాన పార్టీ బలహీనం అనుకున్న ప్రాంతాల్లో అవసరమైతే రూ.5000 ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా బలంగా ఉన్నా, సానుభూతి పవనాలు వీస్తున్నా ప్రస్తుత పరిస్థితిలో రూ.1000తో పని కాదని భావించి మరో పార్టీ రూ.1500 పంపిణీ మొదలుపెట్టింది. గ్రౌండ్ లెవెల్ లో పంపకాల తీరుపై “ఆకేరు” స్పెషల్ రిపోర్ట్..
పార్టీల మధ్య పోరుగా..
ఉప ఎన్నిక అభ్యర్థుల మధ్య పోరుగా కాకుండా.. పార్టీల మధ్య పోరుగా రూపాంతం చెందిన తర్వాత టగ్ ఆఫ్ వార్ మొదలైంది. ఈక్రమంలోనే ఆయా పార్టీల నేతలు శ్రుతి మించి మాటల తూటాలు పేల్చారు. మహామహ నేతల నుంచి చోటామోటా లీడర్ల వరకు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు ద్వితీయ శ్రేణి నాయకులు నెల రోజులుగా జూబ్లీహిల్స్‌లో మకాం వేశారు. ప్రచారంతో పాటు పోల్ మేనేజ్మెంట్ను కూడా నడిపించారు.
షరతులు వర్తిస్తాయ్..
ప్రచార పర్వం.. నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లు ఎలాగున్నా.. ఇప్పుడు నోట్ల పంపకాలు మాత్రం తీవ్రస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పేరు ఎన్నికల హిస్టరీలో నిలిచిపోయేలా ఉందనడం అతిశయోక్తి కాదన్నట్లుగా మారిపోయింది. చివరి రోజుల్లో ప్రధాన పార్టీలు కేవలం ఓట్ల కోసమే పంచిన, పంచుతున్న నోట్లు దాదాపు వంద కోట్లకు పైగానే ఉంటుందన్న ప్రచారం హోరెత్తుతోంది. బస్తీలు, గల్లీల్లో జరుగుతున్న తంతును, వెలుగులోకి వస్తున్న తంతును పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. అందరికీ ‘లెక్క’ పక్కాగా అందేలా అభ్యర్థులు ప్రణాళికలు రచించడం.. పేర్లు, ఫోను నంబర్లు తీసుకుని మరీ పంపకాలు చేయడం.. ఓటు గుర్తింపుకార్డు, ఆధార్ వెంట ఉండాల్సిందే అని షరతులు పెట్టడం జూబ్లీహిల్స్లోనే చెల్లింది.
…………………………………………..
