ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం జూలై 24కు విచారణను వాయిదా వేస్తూ జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్వీఎస్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెలవుల తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపి చాలా వాయిదాలు కోరారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. ఈనేపథ్యంలోనే మరోసారి కూడా విచారణ వాయిదా పడింది. ఈ కేసుతో నాటి టీడీపీ నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉండడం గమనార్హం.
——————————————-