* బ్యూటిఫికేషన్ పేరుతో మునిసిపల్ అధికారుల నిర్వాకం
* చెరువు కట్టకు పొంచి ఉన్న ప్రమాదం
* కట్ట మీద కట్టడాలు – మొదటికే మోసం అంటున్న నిపుణులు
* ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.
* పట్టించుకోని గ్రేటర్ మునిసిపల్ అధికారులు
ఆకేరు న్యూస్ , వరంగల్ :
అందం పేరుతో నగరానికి ప్రమాదం కొని తెస్తున్నారు. పరిరక్షించాల్సిన అధికారులే పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా ఈ వింత సంఘటన జరుగుతోంది అనుకుంటున్నారా.. అక్షరాల ఇదీ మన వరంగల్ నగరంలోనే జరుగుతోంది.
వద్దు.. వద్దు.. ఇలాంటి పనుల వల్ల వరంగల్ నగరమే నిలువునా మునిగిపోతుందని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. తమ పనులను సమర్థించుకోవడానికి అందం అనే ముసుగు తొడుగుతున్నారు. అందం సంగతేమో .. అసలుకే మోసం వచ్చే ప్రమాదకర స్థితి ముంచుకోస్తుందని సాగునీటి శాఖాధికారులు మొత్తుకుంటున్నారు. మీ సలహాలు మా కవసరం లేదంటూ చెరువు కట్టను తొవ్వే పనిని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
* కాకతీయ కాలం నాటి వడ్డెపల్లి చెరువు
కాకతీయుల కాలంలో వడ్డెపల్లి చెరువు నిర్మించబడింది. సాగునీటి అవసరాలతో పాటు, తాగునీటి అవసరాలను కూడా తీర్చేందుకు వీలుగా ఈ చెరువును నిర్మించారు. అత్యంత పటిష్ఠంగా భారీ నీటి సామర్థ్యంతో చెరువును నిర్మించారు. కాలక్రమంలో సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం తాగు నీటి అవసరాలకే ఈ వడ్డెపల్లి చెరువు ఉపయోగపడుతోంది. 1971 మాస్టర్ ప్లాన్లో భాగంగా చెరువు కట్ట కింది భాగాన్ని పార్క్ ఏరియాగా గుర్తించారు. ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. వీటిని అతిక్రమించి ఇప్పటికే భారీ నిర్మాణాలు జరిగాయి. అన్నిటికీ మించి చెరువు కట్టకు ఆనుకుని కూడా బహుళ అంతస్తుల నివాస భవననాలు వెలిసాయి. వడ్డెపల్లి చెరువును ఆనుకుని రైల్వే మార్గం ఉంది. దేశ రాజధానికి వెళ్ళే రైలు ఈ మార్గం ద్వారానే వెళుతుంటాయి. దీనికి తోడు చెరువు శివారు ప్రాంతాల్లో చాలా వరకు కబ్జాలకు గురయినాయి. కబ్జా రాయుల్లపై చర్యలు తీసుకోవడం , చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడం లాంటి పనులు మునిసిపల్ అధికారులు చేయాల్సి ఉంది. చెరువు పరిరక్షణ మాట మరిచి అధికారులు సైతం కట్టను తవ్వడం దానికి బ్యూటిఫికేషన్ అని పేరు పెట్టడం వల్ల చెరువును మరింత ప్రమాదకర స్థితికి నెట్టడం వల్ల వరంగల్ నగరం నీటమునిగే ప్రమాదం ఉందంటున్నారు.
——————————