
* లక్షల కోట్ల అప్పులు.. అప్పులు తీర్చడానికేనట?
* సంక్షేమం ఎలా.. అభివృద్ధి ఎలా?
* వాగ్దానాల అమలుకు ఎన్ని తిప్పలో
* కోట్లాది రూపాయల రుణమాఫీ చేసినా విమర్శలే
* సంకటంలో కాంగ్రెస్ సర్కారు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
నిన్న అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.., తాము 15 నెలల్లో 1.58 లక్షల కోట్ల అప్పు చేశామని, కొత్తగా చేసిన ఆ అప్పుల్లో 1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని వెల్లడించారు. అంటే చేసిన అప్పుల్లో 95 శాతం అప్పులు తీర్చడానికే సరిపోయాయని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఆదాయం సంగతి పక్కన ఉంచితే, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా వాటిని సంక్షేమానికి గానీ, రాష్ట్ర అభివృద్ధి పనులకు గాను వెచ్చించే పరిస్థితి లేదని అర్థం అవుతోంది. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు చేయలేక అపసోపాలు పడుతోంది. అసెంబ్లీలో పేరొన్న లెక్కలను బట్టి చూస్తే, మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని తేలిపోతోంది. ఈక్రమంలో తెలంగాణ అప్పుల తిప్పలపై ఆకేరు న్యూస్ వివరణాత్మక ప్రత్యేక కథనం..
ప్రభుత్వాలు అప్పులు ఎందుకు చేస్తున్నాయి
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలమైన పునాదులతో ఏర్పడింది. ఆదాయంలో ముందు వరుసలో ఉండేది. చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆదాయంలో ఇప్పటికీ రాష్ట్రం మెరుగ్గానే ఉంది. కానీ, ఆదాయానికి మించి ఖర్చులు, పథకాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయనేది వాస్తవం. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణ, నేడు భారీగా పెరిగిన అప్పులతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవీ కారణాలే. ప్రతి నెలా వేల కోట్ల రూపాయలను కేవలం అప్పుల వడ్డీల రూపంలో చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. అధికారంలో ఎవరున్నా అప్పులు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలుకు నిధులు అవసరం. ప్రత్యర్ధి పార్టీల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ హమీలను పార్టీలు చేస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోయింది. దీంతో రాష్ట్రాలు ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని మించి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా..
ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వానికి పాత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా తీర్చాల్సి వస్తుంది. ఆ అప్పుల గురించే మాట్లాడాల్సి వస్తోంది. అందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతోంది. అప్పులు చేసే సమయంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఆలోచించాలి. అంతేకాదు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అప్పులు ఇచ్చే సమయంలో ఆయా సంస్థలు కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అధికారం శాశ్వతమనే భావనలో పాలకులు తీసుకొనే నిర్ణయాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు మరో రకంగా ఉంటాయని, ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోయాల్సిన అవసరం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అప్పుల తెలంగాణగా మారిందిలా..
తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడినప్పుడు ఉన్న అప్పు రూ. 72, 658 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.. పదేళ్లలో అప్పులు పది రెట్లు పెరిగి 6.71 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 24.3 శాతం చొప్పున రుణాలు పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర రుణభారం జీఎస్ డీపీలో 15.7 శాతంగా ఉంది. అప్పట్లో దేశంలోనే ఇది అత్యల్పం. అయితే ఇది 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగింది. ప్రభుత్వ హమీతో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ ను ఏర్పాటు చేసి రూ. 1,85,029 కోట్లు సేకరించారు. ప్రభుత్వ హమీ లేని రుణాలను కలిపితే రాష్ట్రం అప్పులు రూ. 6,71,757 కి చేరాయి. 2014-15లో అసలు, వడ్డీ చెల్లింపులు రూ.7,255 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులు 2023-24 నాటికి రూ.53,978 కోట్లకు చేరినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజాగా నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దిగిపోయేసరికి అన్ని అప్పులూ కలిపి 8.19 లక్షల కోట్ల అప్పు ఉందని వివరించారు. అందులో వాస్తవం ఎంతనేది పక్కన పెడితే.. అప్పులు పెరుగుతున్నాయనేది వాస్తవం.
అసెంబ్లీలో భట్టి ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే ?
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తాజాగా ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు. చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లు. ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్టు సదరు కాగ్ రిపోర్టులో వెల్లడైంది. 2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్ పేర్కొంది. గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపింది. పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లని వెల్లడించింది. వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్ వెల్లడించింది.
అప్పుల భారం తగ్గేదెలా?
తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ఐటీ రంగం మూలాధారంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా జరిగే టర్నోవర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉద్యోగ కల్పన కూడా ఈ రంగం ద్వారా సాధ్యమవుతుంది, తద్వారా ప్రజల ఆదాయం పెరుగుతుంది మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే, ఈ రంగాన్ని మరింతగా విస్తరించడం చాలా ముఖ్యం. ఐటీ కంపెనీలు మూతపడకుండా నిరంతరం వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పాటవుతున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలి. ఒకవైపు భారీగా పెరిగిన అప్పుల భారం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ఐటీ రంగంలో కనిపిస్తున్న పురోగతి కాస్త ఆశాకిరణంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలను సమతుల్యంగా నిర్వహించగలిగితేనే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ కు కత్తిమీద సామే..
కాగ్ నివేదిక ప్రకారం.. రెవెన్యూ రాబడుల్లో 45% సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చవుతోంది. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు రూ49,977 కోట్లుని స్పష్టం చేసింది. మిగులుకు, లోటుకు భారీ స్థాయిలో వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పూడ్చుకోవడం ఒక ఎత్తయితే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు లక్షలాది కోట్ల రూపాయల సమకూర్చుకోవడం కత్తిమీద సవాలే. వాగ్దానాల అమలుకు తిప్పలు పడాల్సి వస్తోంది. కోట్లాది రూపాయల రుణమాఫీ చేసినా, అక్కడక్కడా వెలుగులోకి వస్తున్న ఇబ్బందులతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగకపోతే కాంగ్రెస్ సర్కారుకు ఈ సంకట స్థితి కొనసాగుతూనే ఉంటుంది.
………………………………………..