* అమ్మకానికి ప్రభుత్వ ఉచిత ఇళ్లు!
* పలుచోట్ల క్రయవిక్రయాలు
* ఇప్పిస్తామని మరికొందరి మోసం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం నది పరివాహక ప్రాంతంలోని నివాసాలను ఖాళీ చేయిస్తోంది. దాదాపు 14వేల ఇళ్లను అక్కడి నుంచి తరలించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొందరిని తరలించింది. వారందరికీ గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది. ఉన్నవాటిని ఎలా సరిపెట్టాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంటే, కొందరు ఆ ఇళ్లను బేరాలకు పెడుతున్నారు. లబ్ధిదారుల్లో కొందరు అమ్మేసుకుంటుంటే, మరికొందరు ఆ ఇళ్లను తమకు వచ్చేలా చేస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఆసక్తి చూపని లబ్ధిదారులు
మహానగర పరిధిలోని డబుల్ బెడ్రూంల ఇళ్లను కొన్నిచోట్ల క్రయవిక్రయాలకు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. కొల్లూరు, రాంపల్లి, ప్రతాప్‌సింగారం, దుండిగల్, డీ పోచంపల్లి, నార్సింగి, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ఆయా ప్రాంతాలు నగరానికి కొంత దూరంగా ఉన్నాయి. దీంతో అక్కడి ఇళ్లలోకి వెళ్లేందుకు కొందరు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.
ఆ ప్రాంతాల్లో క్రయవిక్రయాలు
సుదూరం ప్రాంతం నుంచి ఉద్యోగ, ఉపాధికి వెళ్లడం, రావడం ఇబ్బందిగా మారుతోందని కొందరు భావిస్తున్నారు. అలాగే, పిల్లల చదువులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆ ఇళ్లను అమ్మకానికి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఔటర్ పక్కనే ఉన్న కొల్లూరులో పదుల సంఖ్యలో ఇళ్లను లబ్ధిదారులు విక్రయించారని ప్రభుత్వ విభాగాలు గుర్తించాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఓ లబ్దిదారుడు రూ.16 లక్షలకు అమ్మినట్టు మా దృష్టికి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు అధికారవర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ప్రతాప్‌సింగారం, డీ పోచంపల్లి, తిమ్మాయిగూడలోని పలు ఇళ్ల క్రయవిక్రయం జరిగినట్టు గుర్తించారు.
సౌకర్యాలు లేక..
గత ప్రభుత్వం.. సరిగ్గా ఎన్నికలకు ముందు దాదాపు 60వేల మందికి రెండు పడకల ఇళ్లను కేటాయించింది. అంతకుముందు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు ఎలక్ర్టానిక్ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి గతంలోనే పట్టాలు అందజేశారు. వీటిలో 50 శాతానికిపైగా ఇళ్లలో లబ్ధిదారులు ఉంటుండగా, కొన్ని ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా, ఇతరత్రా వసతులు లేకపోవడంతో కొందరు ఇళ్లలోకి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు.
నిబంధనల ప్రకారం..
నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను అమ్ముకునే అధికారం లబ్ధిదారులకు ఉండదు. క్రయవిక్రయాలూ చెల్లవు. కొనుగోలు చేసినా రిజిస్ర్టేషన్ జరగదు. కేవలం నోటరీ ద్వారానే ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది అధికారికంగా చెల్లదని అధికారులు చెబుతున్నారు. అయినా పరస్పర అవగాహనతో లబ్ధిదారులు, కొనుగోలుదారులు ముందుకు సాగుతున్నారు. నోటరీల వివరాలు తెలిసే అవకాశం లేని దృష్ట్యా.. కేటాయించిన లబ్ధిదారులే ఇళ్లలో ఉంటున్నారా..? అన్నది తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారులు కాకుండా ఇతర కుటుంబాలు ఇళ్లలో ఉన్న పక్షంలో ఆ గృహాల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
……………………………………………………….