Marri Yadav Reddy, Bhadrakali Temple KUDA Auction Controversy
* కుడా ప్లాట్స్ వేలంపై ఆరోపణలు..
* తడి బట్టలతో ఆలయానికి వచ్చిన మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్లోని భద్రకాళి దేవాలయం వద్ద గురువారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కుడా ప్లాట్స్ (KUDA) వేలం పాటలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించగా.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు.
ఇటీవల పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గత బీఆర్ఎస్ పాలనలో కుడా ప్లాట్స్ వేలం పాటల్లో అవినీతి జరిగిందని చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని పేర్కొంటూ, అమ్మవారి సాక్షిగా తన నిరసనను తెలియజేయాలని ఆయన ప్రయత్నించారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో మట్టేవాడ పోలీసులు ఆయనను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ ఘటనతో భద్రకాళి దేవాలయం పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య ఈ వ్యవహారం వరంగల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
