* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్ ,వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ మరియు ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.గత జాతర సమయంలో ఎదురైన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతర కోసం చేసిన రవాణా ఏర్పాట్లను వివరించారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి.జాతర విధుల్లో ఉండే డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. గతంలో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని సూచించారు. మేడారం వెళ్లే మార్గ మధ్యలో బస్సులు ఆపి టికెట్లు జారీ చేయకూడదు. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు నేరుగా మేడారం బస్టాండ్‌లోనే ఆగాలి.బస్సు మధ్యలో ఆగదు కాబట్టి, భక్తులు తమ ఆహారం, ఇతర అవసరాలను ముందే సిద్ధం చేసుకోవాలని బస్టాండ్లలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
బస్సులు బ్రేక్ డౌన్ అయితే వెంటనే పునరుద్ధరించేలా కీలక పాయింట్ల వద్ద మెకానిక్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలి. హన్మకొండ బాలసముద్రం వద్ద రద్దీ పెరిగితే, బస్సులను ఇతర మార్గాల ద్వారా మళ్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధంగా ఉండాలి.ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, ఆర్టీసీ అధికారులు భాను కిరణ్, మహేష్, డిపో మేనేజర్లు రవి చందర్, అర్పిత, ధర్మాసింగ్ తదితరులు పాల్గొన్నారు.భక్తుల సౌకర్యార్థం పోలీస్ మరియు ఆర్టీసీ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని, నిబంధనలు పాటిస్తూ జాతరను సక్సెస్ చేయాలని సీపీ కోరారు.

…………………………………………………
