*ఒడిశా వలస కార్మికులను ఆదుకున్న వరంగల్ జిల్లా న్యాయ సేవా సంస్థ
వరంగల్: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వలస కార్మికులపై జరుగుతున్న శ్రమ దోపిడీకి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్డుకట్ట వేసింది. జిల్లాలోని బొల్లికుంట ప్రాంతంలో గల ఇటుక బట్టీల్లో బందీలుగా ఉన్న ఎనిమిది మంది ఒడిశా కార్మికులను రక్షించి, వారిని స్వస్థలాలకు పంపేలా చొరవ చూపింది.
అమానవీయ పరిస్థితుల్లో కార్మికులు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు న్యాయమూర్తి ఎం. సాయి కుమార్ బొల్లికుంటలోని ‘ఇ.యస్.కె. మార్క్ ఇండస్ట్రీస్’ ఇటుక బట్టీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు గుర్తించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. పని వేళల్లో నిబంధనలు పాటించకుండా, తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమను దోచుకుంటున్నట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. కార్మికుల దుస్థితిని చూసి చలించిన న్యాయమూర్తి, అక్కడికక్కడే కార్మిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆదేశిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికులకు రావలసిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఇటుక బట్టీ నిర్వాహకుడి లైసెన్స్‌ను రద్దు చేయాలని సహాయ లేబరు కమిషనర్‌కు సూచించారు. కార్మికులు తమ స్వరాష్ట్రమైన ఒడిశాకు గౌరవప్రదంగా చేరుకోవడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వస్థలాలకు బాధితులు : న్యాయమూర్తి ఆదేశాలతో కార్మిక శాఖ అధికారులు స్పందించి, వాహనాల ద్వారా కార్మికులను ఒడిశాకు పంపే ఏర్పాట్లు పూర్తి చేశారు. నరకప్రాయమైన వెట్టిచాకిరీ నుండి తమను కాపాడినందుకు కార్మికులు న్యాయమూర్తికి, అధికారులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వినోద, మామునూరు ఎస్.ఐ టి.శ్రీకాంత్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు, ఆపదలో ఉన్నవారికి న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
——————–
