* పెళ్లికి నిరాకరించిందని వివాహితపై పెట్రోల్ దాడి..
* నిందితుడు మృతి
ఆకేరు న్యూస్, వరంగల్: ప్రేమ ఉన్మాదం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ, నిరాకరించిందన్న కోపంతో ఒక వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన ఒక వివాహిత, తన భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెకు, అంజయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అంజయ్య ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. తనకు అప్పటికే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా వేధింపులకు గురిచేసేవాడు. అంజయ్య వేధింపులు మితిమీరడంతో, ఆమె తట్టుకోలేక కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే, ఇటీవల ఆమె తిరిగి మహబూబాబాద్‌కు వచ్చి తన తల్లి ఇంట్లో ఉంటున్న విషయం అంజయ్యకు తెలిసింది. మంగళవారం రోజున సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన అంజయ్య, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. ఈ పెనుగులాటలో నిందితుడు అంజయ్యకు కూడా తీవ్రంగా మంటలు అంటుకున్నాయి. ఇద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య బుధవారం ప్రాణాలు విడిచాడు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
