*వరంగల్ నగరానికి భూగర్భ డ్రెయినేజీ మంజూరి
… సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ డా. కడియం కావ్య .
ఆకేరు న్యూస్, హనుమకొండ :
వరంగల్ మహానగరానికి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257.20 కోట్లకు పాలనాపరమైన మంజూరు ఇవ్వడం పట్ల శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
*ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ మహానగరానికి భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు మంజూరు చేయడం ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలను ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ప్రధాన నగరంగా వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని ఎంపీ తెలిపారు. మౌలిక సదుపాయాలు, వైద్య, విద్య, రవాణా తదితర అన్ని రంగాల్లో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని ఎంపీ అన్నారు. భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు అమలుతో నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వరద ముంపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వరంగల్ మహానగర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నదని చెప్పారు. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, అలాగే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపనతో పాటు కాకతీయ టెక్స్టైల్ పరిశ్రమల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే వరంగల్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త దశకు చేరుకుంటుందని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
——
