* తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధికి ప్రణాళికలు
* ఎయిర్‌పోర్టు సహా సర్వ హంగులూ రూపకల్పన
* తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
* హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన మంత్రులు
ఆకేరు న్యూస్, వరంగల్ : కాకతీయుల రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ దశ తిరగబోతోంది. తెలంగాణ రెండో రాజధానిగా రూపాంతరం చెందబోతోంది. విశ్వనగరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు దీటుగా చారిత్రక నగరం వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ సర్కారు కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా భేటీ అయిన మంత్రుల సమావేశంలో కూడా ఆదిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగురోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు.. వంటి భారీ ప్రాజెక్టులను వరంగల్ లో చేపట్టేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. వీలైనంత త్వరలోనే వీటికి సంబంధించిన పనులను పట్టాలెక్కించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ రూపుదిద్దుకుంటే, స్థానికుల పంట పడినట్లే. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. భూముల ధరలకు రెక్కలొస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. మరెన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తాయి.
వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం
వరంగల్ ఇప్పటికే వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఏపీ, ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీతో పాటు, జాతీయ రహదారుల అనుసంధానం ఉంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాలలతో విద్యారంగం పరంగా ఉన్నతస్థానంలో ఉంది. సాంస్కృతిక, పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. కాకతీయుల స్మారక కట్టడాలు, కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ఆకర్షణీయంగా మారాయి. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్, ఆగ్మెంటేషన్ యోజన పథకం కింద ఎంపిక చేయబడిన దేశంలోని పదకొండు నగరాలలో వరంగల్ ఒకటి. అంతేకాదు.. “ఫాస్ట్-ట్రాక్ కాంపిటీషన్”లో స్మార్ట్ సిటీగా కూడా ఎంపికైంది. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రై-సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రెండో రాజధానిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరంగల్‌పై స్పెషల్ ఫోకస్
తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంటోంది. హైదరాబాద్ తరహాలో ఇతర నగరాలను అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. కానీ ఆచరణలోకి రావడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలుత ప్రకటించారు. తాజాగా మరోసారి నిన్న మంత్రులు సమావేశం అయ్యారు. వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. భేటీలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అధికారులు పాల్గొన్నారు. జూన్‌లో వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏడాదిలోనే ఎయిర్‌పోర్టు
భవిష్యత్ జనాభాకు అనుగుణంగా వరంగల్ ను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ – 2050 కు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. 41కి.మీ పరిధిలో ఉన్న వరంగల్ ఔటర్ రింగురోడ్డును మూడు దశల్లో నిర్మించాలని నిర్ణయించినట్లు తాజాగా జరిగిన భేటీలో మంత్రులు వెల్లడించారు. 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రాకాళి చెరువులో పూడిక తీయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా పూడికతీత పనులు ఉండాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. వరంగల్ నగరంలో వీలైనంత త్వరగా అండర్ డ్రైనేజీ పనులు చేపడుతామని ఆయన చెప్పారు. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్‌కు త్వరలోనే ఎయిర్‌పోర్టు రాబోతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించి, ఏడాది లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశిస్తామన్నారు.
…………………………………………………….