* సబ్బండ వర్గాల పోరాట ఫలితమే తెలంగాణ కల సాకారం
* పదేండ్లు కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలేదు.
* పార్లమెంట్లో నాటి ఎంపీలదీ వీరోచిత పోరాటం
* అమరుల త్యాగాల స్పూర్తితో కాంగ్రెస్ పాలన
* తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర కల సాకారానికి కారణమైన ఉద్యమకారులను బీఆర్ ఎస్ పార్టీ పాలనలో పదేండ్లు పట్టించుకోలేదు. కేసీఆర్ ఒక్కడూ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం సర్వం త్యాగం చేసిన ఉద్యమకారులను పట్టిచుకోలేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( Nayini Rajendar Reddy MLA ) అన్నారు. సోమవారం హనుమకొండలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారందరినీ సన్మానించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు మలిదశ ఉద్యమ అమరుల కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించామన్నారు.
* సబ్బండ వర్గాల పోరాట ఫలితమే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి, ఉద్యోగ వర్గాలు , రాజకీయ పార్టీలే కాదు, సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ ఒక్క కుటుంబమో పోరాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదన్నారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేశారు. వారి కుటుంబాలను కూడా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటాన్ని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పదేండ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురయిన తెలంగాణ ఉద్యమ కారులను చిరు సత్కారం చేస్తున్నామన్నారు.
* తెలంగాణ కోసం ఓరుగల్లు ముందు నిలబడ్డది
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓరుగల్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో ఓరుగల్లు ముందు నడిచింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదలైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అయిందన్నారు. అదే విదంగా తెలంగాణ కోసం ఆనాటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో వీరోచితమైన పోరాటం చేశారు .
ఇంత మంది ఉద్యమకారులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా మరోసారి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని కూడా సత్కరిస్తాం. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క , ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు ,ఎమ్మెల్యే నాగరాజు లతో పాటు ప్రొఫెసర్ వెంకటనారాయణ కోదండ రాం , కడియం కావ్య, ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
————————————