*గంజాయి బ్యాచ్ దాడి…
*వరంగల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం..
*స్వీట్ షాపుపై దాడి.. సామాగ్రి ధ్వంసం.
ఆకేరు న్యూస్,వరంగల్: నగరంలో గంజాయి బ్యాచ్లు బరితెగిస్తున్నాయి. మత్తులో ఊగుతూ సామాన్య ప్రజలపై, వ్యాపారులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వరంగల్ పడమర కోట (ఖిలా వరంగల్) చమాన్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు నానా హంగామా సృష్టించారు.
*అసలేం జరిగిందంటే?
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర కోట చమాన్ వద్ద ఉన్న ఒక స్వీట్ షాపులోకి గంజాయి మత్తులో ఉన్న యువకులు ఒక్కసారిగా చొరబడ్డారు. యజమానితో అనవసరంగా గొడవకు దిగి, దుర్భాషలాడుతూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగకుండా షాపులోని వస్తువులను చిందరవందరగా పడేశారు.
*షాపు ధ్వంసం.. భయాందోళనలో వ్యాపారులు…
మత్తులో ఊగిపోతున్న ఆ ఆకతాయిలు షాపులోని వేయింగ్ మెషిన్ (త్రాసు) ను కిందపడేసి పగులగొట్టారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన తినుబండారాలను, స్వీట్లను రోడ్డుపై పారబోసి బీభత్సం సృష్టించారు. ఈ హఠాత్ పరిణామంతో షాపు యజమానితో పాటు అటుగా వెళ్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న గంజాయి సంస్కృతిపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు గస్తీ పెంచి ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
