*కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేసిన కిరాతకుడు
ఆకేరు న్యూస్, కరీంనగర్: “మేమేం పాపం చేశాం నాన్న.. మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావు?” అని ఆ పసిప్రాణాలు వేడుకున్నా ఆ రాక్షసుడి మనసు కరగలేదు. కవల ఆడపిల్లలు పుట్టారన్న నెపంతో, క్షణికావేశంలో ఇద్దరు చిన్నారులను బలితీసుకున్నాడు ఓ కన్నతండ్రి. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
*ఘటన వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలంకు, మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న గీతాన్శ్రీ, గీతాన్విక అనే కవల ఆడపిల్లలు ఉన్నారు.
ఆడపిల్లలని వేధింపులు
పెళ్లయిన కొత్తలో సాఫీగానే సాగిన వీరి సంసారంలో కవల ఆడపిల్లలు పుట్టాక చిచ్చు రేగింది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, కొడుకు పుట్టలేదన్న కారణంతో శ్రీశైలం తరచూ భార్య మౌనికతో గొడవ పడేవాడు. అదనపు కట్నం కోసం, పిల్లల విషయంలో ఆమెను మానసిక భౌతిక వేధింపులకు గురిచేసేవాడు. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ చేసినా శ్రీశైలం ప్రవర్తనలో మార్పు రాలేదు.
*క్షణికావేశంలో ఘాతుకం…
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీశైలం.. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. భార్య వారించినా వినకుండా పిల్లలను తీసుకెళ్లిన అతడు, సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాడు.
అక్కడ చిన్నారులకు బలవంతంగా గడ్డిమందు (పురుగుల మందు) తాగించాడు. ఆపై వారు ప్రాణాపాయ స్థితిలో ఉండగానే, సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి, తానే తప్పు చేశానంటూ భార్యకు చెప్పడంతో ఆమె హతాశురాలైంది.
*గాలింపు చర్యలు – మృతదేహాల లభ్యత…
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో కరీంనగర్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో ఈతగాళ్ల సహాయంతో గాలించి, అర్థరాత్రి సమయానికి గీతాన్శ్రీ, గీతాన్విక మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారులు మృతి చెందారు.
*పోలీసుల విచారణ…
చిన్నారుల తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీశైలం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అందమైన భవిష్యత్తు ఉండాల్సిన ఆ పసిమొగ్గలు తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం చూసి లక్ష్మీపూర్, జూబ్లీనగర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
