Inspire MANAK 2026| జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన విద్యార్థిని వన్నాల రష్మిత తన ప్రతిభను చాటుకుంది. గార్బేజ్ కలెక్షన్ విత్ సైకిల్ (సైకిల్‌తో చెత్త సేకరణ) అనే వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించి న్యాయనిర్ణేతలు, అధికారుల ప్రశంసలు అందుకుంది.
ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్ పథకం 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి 12వ జాతీయస్థాయి ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ (NLEPC) అక్టోబర్ 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు 52 ప్రాజెక్టులతో పాల్గొన్నారు.
ఈ క్రమంలో వర్ధన్నపేటకు చెందిన వన్నాల నాగరాజు, సౌభాగ్య దంపతుల కుమార్తె రష్మిత తన ప్రాజెక్టును ప్రదర్శించింది. చెత్త సేకరణలో సైకిల్‌ను ఉపయోగించే ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్టు ద్వారా తన ఆలోచనలను న్యాయనిర్ణేతలకు స్పష్టంగా వివరించింది. ఆమె ప్రదర్శనను పరిశీలించిన న్యాయనిర్ణేతలు, అధికారులు, సందర్శకులు విద్యార్థిని ప్రతిభను అభినందించారు.
విద్యార్థులకు అధికారుల మార్గదర్శనం
తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారిణిగా డాక్టర్ అడపాల వాణి వ్యవహరించగా, సంగారెడ్డి జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు టీమ్ లీడర్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర పరిశీలకులు, జిల్లా సైన్స్ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రాజెక్టుల ప్రదర్శనలో మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల బస కోసం హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని సదరన్ ఇండియా హోటల్లో ఏర్పాట్లు చేశారు.
రష్మితకు అభినందనలు
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరించిన జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు, సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్‌లకు రష్మిత తల్లిదండ్రులు, జిల్లా విద్యాశాఖ అధికారి కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయస్థాయి వేదికపై వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని తన ప్రతిభను ప్రదర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

