Sandeep Kumar Jha
* రైతు పొలంలో నీటి సంపద
* భూగర్భ జలాలకు ఊతం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ఫార్మ్ పాండ్స్ నిర్మాణంతో రైతులకు నీటి కొరత సమస్య తగ్గడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటిని నిల్వ చేసుకునేందుకు ఫార్మ్ పాండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయగూడెం, ఇప్పగూడెం గ్రామాల్లో వీబీజీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. ఫార్మ్ పాండ్స్ నిర్మాణ పనుల పురోగతి, వాటి కొలతలు, కూలీల హాజరు, వేతనాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లోనా, రైతుల సొంత భూముల్లోనా పనులు చేపడుతున్నారనే వివరాలపై ఆరా తీశారు.
రైతులకు కలిగే ప్రయోజనాలపై ఆరా
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు ఎల్లగౌడ్ తన పొలంలో నిర్మించిన ఫార్మ్ పాండ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఫార్మ్ పాండ్ నిర్మాణంతో కలిగిన ప్రయోజనాలను రైతును అడిగి తెలుసుకున్నారు. తన బోరులో సరిపడా నీరు అందుబాటులో ఉందని, బావిలో నీటి కొరత తగ్గడంతో పాటు నీటిమట్టం కూడా పెరిగిందని రైతు వివరించారు. ప్రస్తుతం తన భూమిలో వరి సాగు చేస్తున్నట్లు తెలిపారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు కలెక్టర్‌కు చెప్పారు.
నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలి
ఫార్మ్ పాండ్స్ పొడవు, వెడల్పు, లోతు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తవ్వకాల ద్వారా వెలువడే మట్టిని గుంతలకు దూరంగా వేయాలని కూలీలకు తెలిపారు. గుంతల సమీపంలో మట్టిని వేస్తే వర్షాల సమయంలో తిరిగి గుంతల్లోకి చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతుల పొలాల్లో ఫార్మ్ పాండ్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించి, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి అందించడంలో వీబీజీ రామ్ జీ పథకం కీలకమని పేర్కొన్నారు.
వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు, పంటల సాగుకు ఫార్మ్ పాండ్స్ దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
ఈ తనిఖీలో డీఆర్డీఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ పి. సూరి, ఎంపీడీవో విజయశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

