* సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా?
* రాష్ట్రంలో కీలక చర్చ
* సర్వే వివరాలు, లెక్కలపై ఎన్నో విమర్శలు.. ఆందోళనలు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే సక్రమంగానే జరిగిందా? ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరైనవేనా? సర్వేలో అందరూ పాల్గొన్నారా? సర్వే తప్పుల తడక అని విపక్షం చెబుతోంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సర్వేను చాలా పకడ్బందీగా నిర్వహించామని పేర్కొంటోంది. దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని అంటోందని. సర్వే ఫలితాలు నిజమా.. కాదా అనేది పక్కన పెడితే ఈ సర్వే వివరాలు వెల్లడి అనంతరం వివిధ సంఘాలు, పార్టీలు సర్కారుపై గరం గరం అవుతున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 3శాతం మందే.. వాస్తవంగా..
తెలంగాణలో జరిగిన కులగణన సర్వేపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా జరగలేదని కొందరు, ఎవరూ తమ ఇంటికి రాలేదని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయంపై సోషల్మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటి కాదు.. తమ కాలనీకే చాలా మంది సర్వే వివరాలు తెలుసుకునేందుకు రాలేదని చెబుతున్నారు. అయితే ప్రజలు అందరూ అందుబాటులో ఉండకపోవడం వల్ల 3శాతం మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెబుతోంది. అయితే, వాస్తవంలో అంతకు ఎన్నో రెట్లు.. జనం సర్వేలో పాల్గొనలేదని విపక్షాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ, ఆ లెక్కల ఆధారంగానే సర్కారు రిజర్వేషన్లను ఖరారు చేస్తోంది.
అదో దొంగ సర్వే..
కులగణన సర్వే.. ఓ దొంగ సర్వే అని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే సర్వే ప్రతులను దహనం చేశారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కులగణన సర్వేను జానారెడ్డి చేయించారు.. ఈ సర్వేను మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం.. ఈ విషయాన్ని బీసీలు సహరించరు.. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకే చెందిన నేత అయినప్పటికీ.. బీసీ సామాజిక వర్గ ప్రతినిధిగా సర్వేను తప్పుబట్టారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా సర్వేను విమర్శిస్తున్నాయి. దాదాపు 20 లక్షల మంది బీసీ జనాభాను తక్కువగా చూపించారంటూ బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాసగౌడ్ విమర్శించారు.
ఎస్సీ కులాల లెక్కలపై సైతం..
బీసీల లెక్కలుపై ఆరోపణలు ఇలా ఉంటే.. ఎస్సీ వర్గీకరణకు సర్కారు ఆమోదం తెలిపినప్పటికీ.. దానిపై కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ భేటీలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో వేసిన ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపింది. గ్రూప్ 1 – ఎస్సీల్లో అత్యంత వెనుక బడిన కులాలు సంచార కులాలకు 1శాతం రిజర్వేషన్, గ్రూప్ 2 – మాదిగ, మాదిగ ఉప కులాలకు 9శాతం రిజర్వేషన్, గ్రూప్ 3 -మాల మాల ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై ఎంఆర్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీల లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని విమర్శించారు. ఏ ప్రాతిపదిక చూసినా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కాలన్నారు. రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని తెలిపారు. 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని తెలిపారు. కానీ ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం.. తమకు 9 శాతమే దక్కుతుందన్నారు. సర్వేలో కొన్ని లెక్కలు తారుమారయ్యాయని, కొన్ని కేటగిరీలను మార్చేశారని విమర్శించారు. ఉదాహరణకు పంబాల కులంతో పాటు మరికొన్ని కులాలను తెరపైకి తెచ్చారు.
మంత్రివర్గ భేటీలో కూడా..?
అంతేకాదు.. ఎస్సీ వర్గీకరణ నివేదిక అంశంపై చర్చ సందర్భంగా మంత్రివర్గ భేటీలో ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలు బయటపడినట్టు సమాచారం. ఒకే సామాజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నో ఆరోపణలు.. విమర్శలు.. ఆరోపణలు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కులగణన సర్వే లెక్కలపై వ్యక్తం అవుతున్నాయి.
…………………………………………..