
* వరంగల్ పండ్ల వ్యాపారుల అవేదన
*అర్ధాంతరంగా ఆగిన మార్కెట్ నిర్మాణం
* బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపణ
* రోడ్డు మీద అమ్మకాలు కొనసాగిస్తున్న వ్యాపారులు
* లోడ్ అన్ లోడ్ లతో ట్రాఫిక్ కు అంతరాయం
* పట్టించుకోని పాలకులు
ఆకేరు న్యూస్ వరంగల్ : వరంగల్ నగరం.. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద నగరం.. హైదరాబాద్ తరువాత అన్ని రకాల హంగులు వసతులు ఉన్న నగరం వరంగల్. ఏ వ్యాపారంలోనైనా హైదరాబాద్ తరువాత వరంగల్ రెండో స్థానంలో ఉంటుంది. హైదరాబాద్ తరువాత పండ్ల వ్యాపారంలో వరంగల్ రెండో స్థానంలో ఉంటుంది. రోజుకు కొన్ని వేల మంది పండ్ల వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న పండ్ల మార్కెట్ కొన్ని దశాబ్దాలుగా మనుగడ సాగిస్తోంది. ఈ నేపధ్యంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష్మీపురం మార్కెట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడ వ్యాపారం చేసుకుంటున్న షెడ్లను తొలగించి శాశ్వత భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఆరు లేదా తొమ్మిది నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో వ్యాపారులందరూ నిర్మాణాలకునుగుణంగా తాము వ్యాపారం చేసుకుంటున్న ప్రదేశాలను వదిలి తాత్కాలికంగా రోడ్డు మీద వ్యాపారాలు మొదలుపెట్టారు. తాత్కాలికంగా రోడ్డు మీద వ్యాపారం చేయాలనుకున్న వ్యాపారులకు ఇప్పుడు రోడ్డు మీదనే శాశ్వతంగా వ్యాపారం చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న నిర్మాణాలు ఆరు ఏళ్లు అయినా పూర్తి కాలేదు నిర్మాణాలు లేక పోవడంతో రోడ్ల మీద వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక మరుగుదొడ్లు టాయిలెట్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు రోడ్డు మీద వ్యాపరం కావడంతో లారీల్లో లోడ్ వస్తే ట్రాపిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది, లారీల రాకపోకలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు రైతులు కూడా మార్కెట్ కు తమ దిగుబడులను తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపధ్యంలో ఆకేరు ప్రతినిధి బృందం మార్కెట్ లో పర్యటించి మార్కెట్ వ్యాపారుల కష్టాలను స్వయంగా పరిశీలించింది. వాళ్ల కష్టాలను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది.
తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం అన్నారు
వెల్ది సాంబయ్య..ఫ్రూట్ మార్కెట్ ప్రెసిడెంట్
ఆరు లేదా తొమ్మిది నెలల వ్యవధిలో అన్ని వసతులతో కూడిన ఫ్రూట్ మార్కెట్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామన్నారు. మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. అప్పటి
బీఆర్ ఎస్ ప్రభుత్వంలో వరంగల్ ఎమ్మెల్యేగా ఉన్న నన్నపునేని నరేందర్ కొత్త మార్కెట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని నమ్మి పండ్ల వ్యాపారులం అందరం నిర్మాణాలు కొనసాగాలని భావించి వ్యాపారాన్ని రోడ్డు మీదకు మార్చుకున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి అయిన కొండా సురేఖ ను కలిసినా ఏం లాభం లేకుండా ఉంది. ఆమె కూడా స్వయంగా చూసి నా కూడా ఫలితం లేకుండా ఉంది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతోనే నిర్మాణాలు కొనసాగించలేక పోతున్నామని కాంట్రాక్టర్ అంటున్నారు. ఇప్పటికైనా మంత్రి కొండా సురేఖ మార్కెట్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నాం.
రోడ్డున పడేశారు..
ఓ మహిళా వ్యాపారి ఆవేదన
కొత్త నిర్మాణాలు చేస్తామని నమ్మించి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు.కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో వ్యాపారాలు సాగిస్తున్నాం.ఎలక్షన్ ముందు హడావిడిగా నిర్మాణాలు ప్రారంభించారు
ఉన్న షెడ్లు ఊడబీకారు రోడ్డున పడేశారు.రెండున్న ర ఏళ్లు అయినా నిర్మాణాలు సాగడం లేదు
అన్ని రాష్టాల నుంచి పండ్లు వస్తాయి
అమ్జద్ ఖాన్ వ్యాపారి
ఇండియా మొత్తం నుంచి పండ్లను దిగుమతి చేసుకుంటాం. సరైన వసతులు లేక పండ్లు అన్నీ వృధా అవుతున్నాయి. పళ్లను భద్ర పరచడానికి సరైన రక్షణ వ్యవస్థ లేకుండా ఉంది. ఈ మార్కెట్ పై కనీసం మూడు వేల మంది తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
నిరుద్యోగులకు జీవనాధారం
స్థానికుడు
ఈ పళ్ల మార్కెట్ ఎంతో మందికి ఉపాధి కల్పించింది. దాదాపు 5వేల కుటుంబాలు ఈ మార్కెట్ పైనే ఆధారపడి జీవించేవి. ఎప్పుడైతే మార్కట్ కూలగొట్టారో అప్పటి నుంచి అందరి పరిస్థితి రోడ్డున పడింది. వర్షం పడితే వ్యాపారుల పరిస్థితి అగమ్మగోచరంగా ఉంటుంది
మామిడాల ఆనంద్
వ్యాపారి
మేమంతా క్రెడిట్ వ్యాపారం చేస్తాం మార్కెట్ కు పక్కా భవనాలు లేక పోవడంతో మాకు ఇబ్బంది అవుతోంది. రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్నందువల్ల వినియోగదారులకు ఏ యే పండ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు.పక్కా బిల్డింగ్ లు లేక పోవడంతో రైతులు కూడా మార్కెట్ కు పండ్లను తీసుకురావడం లేదు . వారికి అనువైన చోట అమ్ముకుంటున్నారు.
ఇప్పటికైనా పూర్తి చేయండి
గోరంతల సమ్మయ్య వ్యాపారి
రైతు ప్రభుత్వం అని చెప్పుకంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మార్కెట్ భవనాలనుమ పూర్తి చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలి.తొందరగా నిర్మాణాలు పూర్తి చేస్తే అందరికీ మేలు జరుగుతుంది
తాగడానికి నీళ్లు లేవు
బ్రహ్మయ్య , వ్యాపారి
మార్కెట్ లో కనీసం నీటి సౌకర్యం లేదు, టాయిలెట్లు లేవు కనీస వసతులు ఏవీ లేవు. టాయెలెట్లు లేక ఆడవారుచాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ దానికి ఇబ్బంది పడుతున్నాం
పస్తులు ఉంటున్నారు
ఆకుల నందప్రియ..వ్యాపారి
మార్కెట్ పై కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి బతికేవి. ఇప్పుడు అందరూ రోడ్డున పడ్డారు.
మార్కెట్ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.చాలా కుటుంబాలు పస్తులతో ఉన్నారు. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తొందరగా పూర్తి చేస్తే అందరూ సంతోషిస్తారు.
కనీస సదుపాయాలు లేవు
నాగపురి సంతోష్ కుమార్ ..వ్యాపారి
మార్కెట్ ను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి.కమిషన్ వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు కనీససదుపాయాలు లేక పోవడంతో వ్యాపారం కొనసాగడం లేదు
జీరో ఆదాయం కూడా రావడం లేదు
పోతా రమేష్ కుమార్ ..కమిషన్ ఏజెంట్
మాకు 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ అందేది ఇప్పుడు జీరో శాతం కూడా రావడం లేదు. ఇప్పుడు బయటి నుంచి అప్పులు తీసుకువచ్చి వ్యాపరం చేస్తూ అప్పులపాలయ్యాం తొందరగా మార్కెట్
నిర్మాణాలు పూర్తి చేసి ఆదుకోవాలి
అద్దెలు చెల్లించలేక పోతున్నాం
సత్యం.. వ్యాపారి
మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బయట అద్దెకు తీసుకొని వ్యాపారం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నాం.ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖలు స్పందించి మార్కెట్ నిర్మాణాలను పూర్తి చేయాలి. ఆటో డ్రైవర్లకు కూడా గిరాకీ లేదు.
ఇప్పటికైనా మంత్రి కొండా సురేఖ మార్కెట్ పై దృష్టి పెట్టి వెంటనే మార్కెట్ ను పూర్తి చేయాలి ప్రభుత్వానికి మంత్రిగారి విజ్ఞప్తి చేస్తున్నాం
లోడ్..అన్ లోడ్ లతో ఇబ్బంది
వెల్ది సతీష్ కుమార్ ..వ్యాపారి
మార్కెట్ నిర్మాణాలు లేక పోవడంతో రోడ్డు మీద వ్యాపారం చాలా ఇబ్బందిగా ఉంది
లోడ్ చేయాలన్నా అన్ లోడ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. లారీల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. రైతులు కూడా ట్రాఫిక్ సమస్యల వల్ల మార్కెట్ కు పండ్లను తీసుకురావడం లేదు
ఎంతో మందికి ఉపాధినిస్తుంది
బొమ్మినేని రవీందర్ రెడ్డి ..చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు
హైదరాబాద్ తరువాత తెలంగాణ లో అతిపెద్ద మార్కెట్.. వరంగల్ మార్కెట్ మూడు జిల్లాకు ఉపయోగకరంగా ఉంటుంది. బిల్లుల పెండింగ్ వల్లే నిర్మాణాలు ఆగాయని కాంట్రాక్టర్ అంటున్నారు. కంట్రాక్టర్ కు చెల్లించాల్పిన బిల్లులను త్వరగా చెల్లించి నిర్మాణాలు పూర్తి చేయాలి. జిల్లాలోని ఎంతో మంది నిరుద్యోగులకు ఈ మార్కెట్ వల్ల ఉపాధి లభిస్తుంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని మార్టెట్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి..
………………………………………………………………..