
* మిగతా రెండు వ్యవస్థలూ అదే గౌరవంతో ఉండాలి
* ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంలో వాదనలు
* రీజనబుల్ టైమ్ అంటే ఏంటని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎమ్మెల్యేలు పార్టీ మారిన పార్టీ వ్యవహారంపై సుప్రీంకోర్టు(SUPREME COURT)లో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితిపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులూ లేవని సింఘ్వీ తెలిపారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైనదన్నారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైనదని, ప్రస్తుత కేసుకు, దానికి పోలిక లేదని వాదించారు. రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ (Justice Gaway) తెలిపారు. మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటని సింఘ్వీని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతోందని అన్నారు. కాగా, సీఎం అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది మరోసారి వినిపించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు విన్న గవాయ్ స్పందించారు. సీఎం(CM) కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా అని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిన తర్వాత ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి అంతకు మించిన వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వీ వివరించారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం పక్కన పెట్టింది. సీఎం మాటలు విని కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని గవాయ్ అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. మిగతా రెండు వ్యవస్థలూ అదే గౌరవంతో ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టులో ఇలా వాదనలు కొనసాగుతున్నాయి.
…………………………………………..