* నూతన పరిజ్ఞానంతో విద్య బోధన అందించాలి
* అన్ని దానాల్లో విద్యా దానం గొప్పది
* స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: నూతన పరిజ్ఞానంతో బోధించే విద్యతోనే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగు కలెక్టరేట్లో క్వాల్ కం కంపెనీ, ట్రాన్స్ఫారం పాఠశాలల యాజమాన్యం సంయుక్తంగా 9,10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన కోసం ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ తరగతులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, ప్రిన్సిపాల్ ఎన్కైనర్, క్వాల్కం సుధీర్ కుమార్ సుంకర, ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రద్ధా రaా, హెడ్-ప్రోగ్రామ్, క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ నేహా రానాలతో కలిసి పుస్తక ఆవిష్కరణ శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా రాష్ట్రాన్ని పలు రంగాల్లో అభివృద్ధి సాధించుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థిని, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి ఉపాధ్యాయులకు స్వచ్ఛంద సంస్థల వారు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయమన్నారు. ప్రపంచ విషయాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలుసుకున్నప్పుడే విద్యా బోధన మెరుగుపడుతుందని చెప్పారు. ఇందు కోసం గ్రామీణ ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. రెండు సంస్థలు మెరుగైన విద్యనందించేందుకు పలు రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా ములుగులో నిర్వహించడం జిల్లా కలెక్టర్ కృషేనని కొనియాడారు.
విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలి..
ఉపాధ్యాయులు విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలని, అన్ని దానాలలో కన్నా విద్య దానం గొప్పదని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యే శ్రద్ద చూపి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సమాజానికి మనం ఏం చేస్తున్నామో అదే తరహాలో సమాజం మనకు మేలు చేస్తుందని, రాష్ట్రంలో అద్భుతమైన మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి 20 సంస్థలతో ఒప్పందం జరిగిందని ఆయా సంస్థల సహకారంతో ప్రజలకు అవసరం ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పట్టణాల్లో ఉన్న విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పలు విషయాలలో అవగాహన కలిగి ఉంటారని, ఒక ఇంట్లో ఒకరు చదువుకొని ఉంటే ఆ కుటుంబం పూర్తిస్థాయిలో బాగుపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, డిఈఓ పాణిని, మేనేజర్ లీడర్షిప్, కమ్యూనిటీ ప్రోగ్రామ్ హితేష్ దశభయ, టెక్నికల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మిహిర్ పాండా, 20 పాఠశాలలు చెందిన ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………