* ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
* అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేత
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( REVANTH REDDY) చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను (ELECRIC VEHCLES ) ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను తెలియజేశారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడిరచారు. రవాణా శాఖలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందించడంలో ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని.. తెలంగాణలో గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ పది నెలల్లో 50 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసిన సందర్భం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిన సందర్భం అన్నారు. ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికైన యువతీ, యువకులు గ్రామాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. గృహ ప్రవేశాల్లాంటి శుభ సందర్భాల్లో మత్తు పదార్థాలు తీసుకుని బుకాయించే సంస్కృతి రానీయొద్దన్నారు. 10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామని.. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల 1.05 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని.. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటున్న 49.90 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. ఆడబిడ్డలకు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 పోస్టులకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించామని.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇలాంటివెన్నో చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………………