* మేడారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ ములుగు : మేడారం సమ్మక్క సారక్క ప్రాంగణానికి చారిత్రిక వైభవం కల్పిస్తామని చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా ప్రాంగణాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు సీఎం మేడారంలో పర్యటించి సమ్మక్క సారక్క ల గద్దెల నిర్మాణ పనులను ప్రాంగణ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రామప్పగుడి ఎలా ఇయితే చెక్కు చెదరకుండా శతాబ్దాల కాలంగా నిలిచి ఉందో అలాంటి నిర్మాణాన్నే మేడారంలో చేపడతామన్నరు. ఆలయ ప్రాంగణం పూర్తిగా రాతితోనే నిర్మిస్తామని రేవంత్ అన్నారు. నిధుల కోసం వెనుకాడమని ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మేధావుల, ఆదివాసీల సలహాల మేరకే నిర్మాణ పనులు ఉంటాయని సీఎం రేవంత్ అన్నారు. ఆలయ నిర్మాణం భావోద్వేగంతో కూడిన బాధ్యత అని రేవంత్ అన్నారు. గత 18 ఏళ్లుగా మేడారంను దర్శించుకుంటున్నానని రేవంత్ గుర్తు చేసుకున్నారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతోనే అని రేవంత్ అన్నారు. ఎన్నికల ప్రచారం తల్లుల ఆశీర్వాదం తీసుకునే ప్రారంభించానని రేవంత్ అన్నారు.దొరల పాలన తొలగించి ప్రజాపాలన తెస్తానని ఇక్కడే ప్రతిజ్ఞ చేశానని రేవంత్ తెలిపారు.
గొప్ప అవకాశం
తన జీవితంలో ఇదొక గొప్ప అవకాశమని వనదేవతల ఆలయాలను నిర్మించే భాగ్యం తనకు కలిగిందని ఈ జీవితానికి తృఫ్లినిచ్చే పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. ఇంతటి మహత్కార్యంలో తాను భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు
ఆదివాసీల అభివృద్దికే పెద్దపీట
ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం రూపొందించే ప్రతీ ప్రణాళికలో అధివాసీలను భాగస్వామ్యం చేస్తున్నామని రేవంత్ అన్నారు. అదివాసీలకు అందరికీ పక్కాఇళ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు. ఏ ఒక్క ఆవివాసీ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండరాదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
100 రోజుల్లో పనులు పూర్తి
జాతర అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేస్తామని రేవంత్ తెలిపారు. దీనికి సంబందించిన నిపుణులు, అధికారుల అందరూ అహర్నిశలు కృషి చేసి జనవరి 28 కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జాతర పనులు పూర్తయ్యేంత వరకూ అందుబాటులో ఉంటారని సీఎం తెలిపారు. స్థానికులు కూడా అధికారులకు సహకరించి పనులు చక్కగా జరిగేలా సహకరించాలని కోరారు.
జాతీయ పండగగా గుర్తించాలి
మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుంభమేళాను తలపించే ఈ జాతరలో లక్షలాది జనం వస్తారని ఇంత పెద్ద గిరిజన జాతర ప్రపంచంలో ఎక్కడా లేదని రేవంత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించి కుంబమేళాకు ఎలాగైతే నిధులు కేటాయిస్తున్నారో సమ్మక్క జాతరకు కూడా అదే విధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మంత్రులు కొండా సురేఖ, సీతక్క,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు
…………………………..
