* అభివృద్దిని అడ్డుకునే కుట్రలను సహించం
* కెసిఆర్ ఫామ్‌హౌజ్ వీడి ప్రజల్లోకి రావాలి
* మహిళల అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
* వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
* వరంగల్ వేదికగా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతామని సిఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY ) హెచ్చరించారు. పదేళ్లపాటు తెలంగాణను దోచుకున్న సొమ్ముతో కిరాయి మనుషులతో అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ( BRS) పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ప్రజా పాలన`ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ తొలిసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి.. పదేళ్లలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18500 కోట్లలో రూ.6500 కోట్లు జీతాలు రూపంలో.. మరో రూ.6000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో పోతున్నాయని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడదాం రావాలని కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్‌కు సవాల్ విసిరారు. నువ్వు అసెంబ్లీకి రావు.. ఇద్దరు చిల్లరగాళ్ళను వదిలావని కేటీఆర్, హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే జైల్లో పెట్టీ ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని.. కచ్చితంగా అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లపాటు మనసొప్పలేదని, ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు. తెలంగాణను అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలను కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, జూపల్లి, పొన్నంప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ఎంపి కడియం కావ్య, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
…………………………………..