* ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్ననూ కేసీఆర్ మోసం చేసిన్రు
* ఆయన ఫాంహౌస్‌లో కూర్చుంటే, కేటీఆర్, హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్రు
* కేటీఆర్ త్వరలో ఊచలు లెక్కిస్తారు..
* దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్
* వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వేములవాడ : అసెంబ్లీలో అధికారం కోల్పోయారు.. పార్లమెంట్ లో సీట్లు కోల్పోయారు.. ఇప్పుడు వాళ్ల మాటలను చూస్తుంటే బీఆర్ఎస్(BRS) నేతలకు మైండ్ దొబ్బినట్లు అనిపిస్తోందని సీఎం రేవంత్(CM REVANTH) ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల నేపథ్యంలో వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజన్న ఆలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి భూమి పూజ చేశారు. రూ. 235 కోట్ల నిధులతో మిడ్ మానేరు నిర్వాసితుల కోసం ఇందిరమ్మ ఇళ్లకు, రూ. 166 కోట్ల తో గవర్నమెంట్ బ్లాక్ కు, రూ. 4.80కోట్లతో ఉమెన్స్ హాస్టల్ భవనం, నేతన్నల కోసం రూ. 50 కోట్లతో నూలు బ్యాంకు, రూ. 76 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు, రూ. 30 కోట్లతో అన్నదాన సత్రం, వేములవాడలో రూ. 1.45 కోట్లతో గ్రంథాలయం తదితర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 631 మహిళా శక్తి గ్రూపులకు 103 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. అనంతరం వేములవాడ గుడిచెరువు ప్రాంగణంలో నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. వేములవాడ(VEMULAWADA) రాజన్న సాక్షిగా.. స్థానిక ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
కరీంనగర్ గడ్డ నుంచే కంకణం
ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదని , వేములవాడ రాజన్నను మోసం చేసిన చంద్రశేఖర్ రావును గద్దె దించాలని ఈ గడ్డ నుంచే కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని, ఇందిరమ్మ రాజ్యంలో వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అలాగే, ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తున్నామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు అన్నింటిపైనా నవంబర్ 30లోపు ఉత్తమ్ దిశా దశ నిర్దేశిస్తారన్నారు. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని తెలిపారు. పీవీ నర్సింహారావు(PV NARASIMHA RAO) కరీంనగర్ గడ్డ ఖ్యాతిని పెంచారని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికే చూపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ను ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డి(JAIPAL REDDY) కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఈ గడ్డ నుంచే రాష్ట్ర ఏర్పాటుకు హామీ
తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ ప్రాంతంలోనే ఉవ్వెత్తున ఉద్యమం మొదలైందన్నారు. 2004లో సోనియాగాంధీ రాష్ట్రం ఇస్తామని ఈ గడ్డ నుంచే నాలుగు కోట్ల మందికి హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియమ్మ రాష్ట్రం ప్రకటించారని గుర్తు చేశారు. మీ ఎమ్మెల్యేను చూస్తేనే తనకు భయం వేస్తాదని, మళ్లీ ఏ కాగితం తెచ్చాడో అని, మళ్లీ ఏం అడుగుతాడో అని అన్నారు. తన ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వాలని తిరుగుతానే ఉన్నాడని తెలిపారు. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకమైన బోర్డు తేవాలని ఆలోచిస్తున్నట్లు వివరించారు.
ఆయనేమో ఫాంహౌస్‌లో కూర్చుంటాడు.. ఈ ఇద్దరు మన కాళ్లలో కట్టె పెట్టి అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని కేటీఆర్, హరీశ్‌లను ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీలో అధికారం కోల్పోయారు.. పార్లమెంట్ లో ఉన్న సీట్లన్నీ కోల్పోయారు.. ఇప్పుడు వాళ్ల మాటలు చూస్తుంటే, వాళ్ల మెదడే పోయినట్లుందని తనకు అనిపిస్తుందన్నారు. వస్తున్నాయ్.. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండమని తెలిపారు. బీఆర్ ఎస్ ఎంపీలు, బండి సంజయ్(BANDI SANJAY) కూడా కరీంనగర్ కు ఏమీ చేయలేదన్నారు. పదేళ్లలో రైతుల కోసం నువ్వు పనిచేసి ఉంటే, తనకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండేది కాదని కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదే నా సవాల్..
పదేళ్ల కాలంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో.. తాను పది నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చానని, ఎల్బీ స్టేడియంలోనికి పిలిపించి తలలు లెక్కిద్దామని, ఒక్కటి తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన ఘనత కాంగ్రెస్ హయాంలోనే అని తెలిపారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు లిఫ్ట్ చేయకుండా ఈ ఘనత సాధించామన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్ల రికార్డు స్థాయిలో వడ్లు పండాయన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు అయినా నువ్వు పూర్తి చేసినవా అని కేసీఆర్(KCR) ను ప్రశ్నించారు.
బామ్మర్ది తాగి తందనాలు ఆడుతుంటే..
బామ్మర్ది తాగి తందనాలు ఆడుతుంటే, ఆయన ఇంట్లో డ్రగ్స్ దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్‌లు కడితే వదిలేయాలా అని కేటీఆర్(KTR) ను ప్రశ్నించారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఎవరైనా దొరికితే 5 వేల ఫైన్ వేస్తున్నారని, సామాన్యులకో చట్టం, మీకో చట్టమా అన్నారు. కొడంగల్ ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఉండేందుకు హరీశ్‌రావు కాళ్లలో కట్టెలు పెడుతున్నాడని తెలిపారు. రంగనాయక్ సాగర్ వద్ద హరీశ్ రావు ఫాంహౌస్ కట్టుకున్నాడన్నారు. శాశ్వత అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భూమి ఇచ్చే రైతులకు మూడు రెట్లు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులతో సమానంగా భూమిని భావించే ఈ సమాజంలో బాధితులను తగిన విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నామన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని తాము తీసుకోబోమని, పరిశ్రమలను పెట్టి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే అని తెలిపారు. తాను సేకరిస్తా అన్నది 4 గ్రామాల్లో 1100 ఎకరాలు, అదే ప్రపంచ సమస్య అయిందా అన్నారు. భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు. తన నియోజకవర్గంపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేందర్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………..