* తాజాగా ఢిల్లీ లో కారు బ్లాస్ట్
* అలర్ట్ అయిన పోలీసులు.. క్షుణ్ణంగా తనిఖీలు
ఆకేరు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
ఢిల్లీ కారు బ్లాస్ట్ తో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. కీలక ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయం, రద్దీ ప్రాంతాలు, సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా హైదరాబాద్ నగరంతో ఏదో లింకులు బయట పడుతున్నాయి. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు ఒక షెల్టర్ జోన్‌గా మారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్ నేపథ్యంలో నగర పోలీసులు సీరియస్ గా తనిఖీలు చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని చర్యలూ చేపట్టారు.
సిటీలో స్లీపర్ సెల్స్?
ఢిల్లీ పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం కలకలం రేపింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరిగినా నగరంతో లింకులు బయటపడ్డాయి. మోహియుద్దీన్ లాంటి ఉగ్రవాదులే కాకుండా, సిటీలో స్లీపర్ సెల్స్ ఉన్నారనే ఆరోపణలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మేలో విజయనగరంలో ఉగ్రకుట్ర కేసులో కీలకంగా ఉన్న సిరాజ్, సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు తెలంగాణలో మరో 20 మంది మావనబాంబులకు శిక్షణ ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. వారెవరో ఇంతవరకూ తెలియలేదు.
భారీ విధ్వంసానికి డాక్టర్ కుట్ర
డాక్టర్ మోహినుద్దీన్ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. ఐసిస్ ఆదేశాల కోసం ఎదురుచూస్తుండగా పట్టుబడ్డాడు. రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లోనే డాక్టర్ మోహియుద్దీన్ రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేయడం సంచలనంగా మారింది. దాన్ని ఎక్కడ ఎలా వాడాలనే ఆదేశాల కోసం ఎదురుచూస్తుండగా ఆయనను అరెస్టు చేశారు. ఐసిస్ సభ్యుడు అబూ ఖదీజాతో సోషల్‌మీడియా ద్వారా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మంలోని తాత ఇంట్లో చదువుకున్నాడు. ఇంటర్లో వరంగల్ లో చదివాడు. ఎంసెట్ లో ర్యాంకు రాకపోవడంతో 2007లో చైనాకు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2013లో చైనా నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో పనిచేశాడు. కరోనా తర్వాత ఉద్యోగం మానేసి, షవర్మా, జ్యూస్ సెంటర్ నిర్వహించాడు. ఒక యువతితో వివాహం కుదిరి రద్దు రావడంతో తీవ్రంగా కలత చెందినట్లు గుర్తించారు. సోషల్‌మీడియా ద్వారా ఐసిస్ సభ్యుడు అబూ ఖదీజాతో పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తెలంగాణలో ఉగ్రమూలాలు?
విజయనగరం ఉగ్రవాదులైనా, రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లయినా, ముంబై బ్లాస్ట్లైనా, కశ్మీర్ ఉగ్ర లింకులైనా, ఢిల్లీ మావన బాంబులైనా తెలంగాణలో ఆ ఉగ్రమూకల మూలాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిహద్దు దేశాల నుంచి నిత్యం హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారిపై నిరంతరం నిఘా అవసరం. కానీ నిఘా వర్గాలు ఆ విషయంలో విఫలం అవుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, సిబ్బంది దాన్ని పనిష్మెంట్ విధులుగా భావించి చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ఉగ్రవాదులు ఉన్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వచ్చి బోధన్‌లో అరెస్టులు చేసింది. తాజాగా ఈనెల 7న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టు అయిన రిజ్వాన్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు.. తన అరెస్టుకు ముందు 6 నెలలు హైదరాబాద్‌లో గడిపారు. అయినప్పటికీ నగర ఎస్బీ అధికారులు పసిగట్టలేకపోయారు. ఈనేపథ్యంలోనే సీపీ సజ్జనార్ ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిఘా పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి.. తగిన చర్యలు చేపడుతున్నారు.
………………………………………………………..
