*2026 మార్చిలోపు మావోల అంతం ఖాయం
* అర్బన్ నక్సలైట్ అన్న మాటలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం
* మీడియాతో బండి సంజయ్ కామెంట్స్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మావోయిజానికి బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోం శాక సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. 2026 మార్చిలోపు మావోల అంతం ఖాయంగా ఉంటుందని ఆయన చెప్పారు.హుజూరాబాద్‌లో బుధవారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తాను చేసిన అర్బన్ నక్సలైట్లు వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఈ విధానాన్ని ప్రజలు హర్షించబోరని తాము చెబుతూ వచ్చామని ఈ రోజు అదే నిజమైందన్నారు. కేంద్ర హోం మంత్రి మాటంటే నిలబెట్టుకుంటారని అనుకున్న 2026 మర్చిలోగానే మావోయిజాన్ని అంతం చేసి తీరుతారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. దీంతో ప్రపంచంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని బండి సంజయ్ చెప్పారు. మావోయిస్టులకు లొంగిపోవాల్సింది తప్పితే మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
……………………………………………..
