* ఐస్ క్రీములో 100పైపర్స్ విస్కీ
* లిక్కర్ ఐస్ క్రీములు విక్రయిస్తున్న ముఠా
* గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
* 11.5 కేజీల విస్కీతో కూడిన ఐస్ క్రీము స్వాధీనం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఐస్ క్రీములో విస్కీ కలిపి చిన్నారులను మత్తుకు అలవాటు చేసి వారి జీవితాలలో చెలగాటమాడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమును స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5 లోని అరికో ఐస్ క్రీం పార్లర్ లో 100పైపర్స్ విస్కీ కలిపి అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. రక రకాల ఫ్లేవర్ తో కూడిన ఐస్ క్రీముల గురించి నిర్వాహకులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారని చెప్పారు. 60 గ్రాముల ఐస్ క్రీముకు సుమారు 100ఎం.ఎల్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ దాడుల్లో మొత్తం 11.5 కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీమును సీజ్ చేశామని వెల్లడించారు. నగరంలో ఇలాంటి లిక్కర్ ఐస్ క్రీములు విక్రయిస్తున్న పార్లర్ లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.
———————————