![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-29.jpg)
* కేటీఆర్ పరామర్శ.. ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం
* దాడిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 17 మంది ఆచూకీని గుర్తించారు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా.. వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 7న వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్ (Rangarajan)నివాసం ఉంటుంది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్నారు. అలాగే దేవాలయాన్ని తమకు అప్పగించాలని రంగరాజన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి(Veeraraghavareddy), అతడి అనుచరులు దాడి చేశారు.
దాడికి ఖండన
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr).. రంగరాజన్‌ను పరామర్శించారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగరాజన్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సేవలు చేస్తోందని, ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని.. రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్న ఏ జెండా పట్టుకున్న కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (PavanKalyan) కూడా ఈ దాడిపై స్పందించారు. ఇది సనాతన ధర్మంపై దాడిగా పేర్కొన్నారు. రంగరాజన్ ను పరామర్శించాలని జనసేన తెలంగాణ నేతలను ఆదేశించారు.
…………………………………………..