
* సంపద సృష్టి.. బాబు కుటుంబాలకే
* ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయి
* ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దు
* విజయసాయి రెడ్డి సహా ఎవరైనా అంతే
* మీడియా సమావేశంలో జగన్ సంచలన విషయాలు
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ (Ex CM Jaganmohan) రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ’ ఏమైందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు’ అంటూ ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయని జగన్ నిలదీశారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం (Aliance Government)రికార్డ్ బద్దలు కొట్టిందని, 9 నెలల్లోనే రూ.80 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52 వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వేలం పాట ఎలా జరిగిందో అందరికీ తెలుసని, ఇసుక రేటు ఇప్పుడే ఎక్కువగా ఉందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ప్రస్తుతం చేసిన, చోయబోతున్న అప్పులు రూ.1.45 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని జగన్ అన్నారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ (Super Six) ఇచ్చారా?.. అని ప్రశ్నించారు. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ఆరోపించారు.
విజయసాయిరెడ్డి రాజీనామా స్పందించిన జగన్
తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లారని, తమ పార్టీ ప్రజా ప్రతినిధులు లేదా నాయకులను ఎవరో ఒకరిని ఇరికించి కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు నిలబడతాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దని ఆయన కోరారు. విజయసాయి రెడ్డి(Vijayasai Reddy)తో పాటు ఎవరికైనా ఇదే వర్తిస్తోందని ఆయన అన్నారు.
…………………………………….