* ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులు కలిపిన బీఆర్ఎస్, బీజేపీ
* టీపీసీసీ మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, (ప్రజాపోరు): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫాం హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌లో కేసీఆర్ సేద తీరుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని అన్నారు. సోమవారం గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిరచడానికి బీఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు అయ్యారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఆక్షేపించారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీగా వస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో మొట్ట మొదటిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. కుల గణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని ఉద్ఘాటించారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో కేటీఆర్ – కవిత – హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శలు చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చొరవతో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
………………………………………………..