
* అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ
ఆకేరు న్యూస్, డెస్క్ : లోక్సభలో వక్ఫ్ ( సవరణ) 2024 బిల్లు(Waqf Bill)ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించింది. అవసరమైతే దీన్ని పొడిగిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rujiju) అన్నారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకున్నామని లోక్ సభలో ప్రకటించారు. ఈ చట్టంపై ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. వక్ఫ్ అనేది సమ్మిళితంగా, లౌకికంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కోరుకుంటోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని కేంద్రం చెబుతోంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తుల(Waqf Propertys) ను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఎలాగైనా ఈ బిల్లును ఆమోదింపచేసుకునేలా కేంద్రం పట్టుదలతో ఉంది. 8 గంటల చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. విప్ జారీ చేయడంతో అధికార, విపక్ష ఎంపీలు అందరూ చర్చలో పాల్గొన్నారు.
…………………………………………