Winter Skin Care
* డ్రై స్కిన్, చేతుల పగుళ్లకు చెక్..
* మాయిశ్చరైజర్‌తో చర్మానికి రక్ష
* డాక్టర్ అశ్విని కీలక సూచనలు
ఆకేరు న్యూస్, హెల్త్ : చలికాలంలో వాతావరణంలో తేమ తగ్గడంతో చర్మం పొడిబారడం, దురద, పొట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికే డ్రై స్కిన్‌తో బాధపడేవారితో పాటు సోరియాసిస్, ఎగ్జిమా, అటోపిక్ డెర్మటైటిస్, సెబోరిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారిలోనూ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేతులు, కాళ్లు పగిలి ఇబ్బంది పెడితే ఏం చేయాలి? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అశ్విని గుత్తెదార్ (Dr Ashwini Guttedar – MD, DVL) ఆకేరు న్యూస్ స్టూడియోలో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.
* చలికాలంలో చర్మం ఎందుకు పొడిబారుతుంది..
శీతాకాలంలో చుట్టుపక్కల వాతావరణంలో తేమ తగ్గడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీంతో చర్మంపై పొట్టు రాలడం, తెల్లటి పొలుసులు కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్ అశ్విని వివరించారు. సహజంగానే చర్మం పొడిగా ఉండేవారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ఇప్పటికే సోరియాసిస్, ఎగ్జిమా(Eczema), అటోపిక్ డెర్మటైటిస్, సెబోరిక్ డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
* స్నానానికి ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు అవసరం
డ్రై స్కిన్ (Dry Skin) ఉన్నవారు స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సూచించారు. స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు ఉండకుండా, గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. వేడి నీటితో స్నానం చేయడం, సబ్బులను అధికంగా ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంటుందని వివరించారు. సబ్బుల విషయంలోనూ జాగ్రత్త అవసరమని తెలిపారు. మైల్డ్ క్లెన్సర్లు, పీహెచ్ బ్యాలెన్స్డ్ సబ్బులు లేదా బాడీ వాష్లను ఎంచుకోవాలని సూచించారు.

ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజూ శరీరమంతా సబ్బు రాయాల్సిన అవసరం లేదని, చెమట ఎక్కువగా వచ్చే శరీర మడతలు, చర్మం శుభ్రం చేయాల్సిన ప్రాంతాలపై దృష్టి పెట్టాలని వివరించారు. స్నానం చేసిన వెంటనే చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ అశ్విని చెప్పారు. పెట్రోలియం ఆధారిత లేదా సెరామైడ్ ఆధారిత మాయిశ్చరైజర్లను (Moisturisers) ఉపయోగించడం ద్వారా చర్మంలోని తేమను నిలుపుకోవచ్చని తెలిపారు. స్నానం చేసిన తర్వాత ఆలస్యం చేయకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచించారు.
* వూలెన్ దుస్తులతో దురద రావచ్చు..
చలిని తట్టుకునేందుకు చాలామంది వూలెన్ దుస్తులు ధరిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి నేరుగా చర్మాన్ని తాకడం వల్ల దురద, చికాకు వంటి సమస్యలు రావచ్చని డాక్టర్ అశ్విని వివరించారు. దీనిని గార్మెంట్ డెర్మటైటిస్‌గా పేర్కొంటారని చెప్పారు. అందువల్ల వూలెన్ దుస్తులు ధరించే ముందు శరీరానికి కాటన్ దుస్తులు వేసుకుని, వాటిపై వూలెన్ దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారు, వృద్ధులు చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
* చేతులు, కాళ్లు పగిలితే నిర్లక్ష్యం వద్దు..
చలికాలంలో చేతులు, కాళ్లు విపరీతంగా పొడిబారి పగుళ్లు ఏర్పడటం, కొన్నిసార్లు పగుళ్ల నుంచి ద్రవం లేదా రక్తం రావడం వంటి సమస్యలు కనిపిస్తాయని డాక్టర్ అశ్విని చెప్పారు. చేతులకు వచ్చే ఇలాంటి సమస్యలను హ్యాండ్ ఎగ్జిమా లేదా హ్యాండ్ డెర్మటైటిస్ రూపంలో చూడవచ్చని వివరించారు. ఈ సమస్యలు ఉన్నవారు సబ్బులు, డిటర్జెంట్ల వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని సూచించారు. గిన్నెలు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు చేతులకు రక్షణగా గ్లౌజులు ధరించడం మంచిదని తెలిపారు.
రాత్రి నిద్రించే ముందు చేతులకు మందమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుని గ్లౌజులు ధరించడం వల్ల పొడిబారడం తగ్గేందుకు సహాయపడుతుందని చెప్పారు. యూరియా, పెట్రోలియం లేదా లాక్టిక్ యాసిడ్ ఆధారిత క్రీములు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడతాయని వివరించారు. అయితే చేతుల్లో లోతైన పగుళ్లు, రక్తస్రావం లేదా ద్రవం కారడం వంటి లక్షణాలు ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
* చర్మ సంరక్షణే కీలకం..
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే స్నానపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, తగిన మాయిశ్చరైజర్ ఉపయోగించడం, చర్మానికి చికాకు కలిగించే దుస్తులు, పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని డాక్టర్ అశ్విని గుత్తెదార్ పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రై స్కిన్‌తో బాధపడేవారు, వృద్ధులు ఈ సూచనలు పాటిస్తే చర్మ సమస్యలను నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

