జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్‌యాదవ్?
* గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
* నవీన్ ఆఫీసులో కూడా పండుగ వాతావరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ దాదాపు గెలిచినట్లే ప్రస్తుత సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మొదటి రౌండ్ నుంచీ కాంగ్రెస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. తొలి రౌండ్ లో మొదలైన షేక్ పేట డివిజన్లో మాత్రమే కాస్త బీఆర్ ఎస్ గట్టి ఫైట్ ఇచ్చినట్లుగా తేలగా.., ఆ తర్వాత ప్రతీ రౌండ్ లోనూ కాంగ్రెస్ దాదాపు 3వేల ఓట్ల మెజారిటీని తెచ్చుకుంటూ ఉంది.
రౌండ్ల వారీగా..
ఇప్పటి వరకు అధికారికంగా 4 రౌండ్ల ఫలితాలు మాత్రమే ఎన్నికల సంఘం వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లో షేక్‌పేట డివిజన్ మాత్ర స్వల్ప (47) ఓట్ల ఆధిక్యం రాగా, తర్వాత ప్రతీ రౌండ్ లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉంది. రెండో రౌండ్ వచ్చేసరికి.. 2, 995 ఓట్లు, మూడో రౌండ్లో 2, 948, నాలుగో రౌండ్ 3,558, ఐదో రౌండ్ వచ్చేసరికి 3,178, ఆరోరౌండ్లో 2, 938 ఓట్ల లీడ్‌లో ఉంది. ఆరు రౌండ్లు ముగిసేసరికి అనధికారికంగా 15, 589 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. దీన్ని బట్టి బీఆర్ ఎస్ వైపు గెలుపు అవకాశాలు మారే అవకాశాలు దాదాపు లేకపోవడంతో నవీన్ విజయం ఖాయమైనట్లుగానే ప్రస్తుత ట్రెండ్ కొనసాగుతోంది. అధికారికంగా 4వ రౌండ్ వచ్చేసరికి 9 వేల మెజారిటీ వచ్చింది.
సంబరాలు మొదలు..
కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపు ఖాయంగా ఫలితాల సరళి కనిపించడంతో గాంధీభవన్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లో అక్కడకు మంత్రులు అందరూ చేరుకోనున్నారు. సీనియర్ నేత వీహెచ్ ఇప్పటికే సంబరాల్లో భాగస్వాములయ్యారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోని నవీన్‌యాదవ్ ఆఫీసులో కూడా వేడుకలు ప్రారంభం అయ్యాయి. భారీ సంఖ్యలో నవీన్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. బాణసంచాల కాల్చుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలు ఓట్లు వేశారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
…………………………………………………

