* వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య
* నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం
ఆకేరున్యూస్, హనుమకొండ: జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమే.. సమాజ మార్పులోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. పుస్తక పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతం అని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ( MP KADIYAM KAVYA) అన్నారు. జాతీయ పుస్తక వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా హనుమకొండ అశోకా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన నవచేతన పుస్తక ప్రదర్శనను ఎంపి డాక్టర్ కడియం కావ్య దంపతులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యంఅవుతుందని అన్నారు. పుస్తకాలు విజ్ఞాన నేస్తాలని, సాంకేతికత ఎంతగా పెరిగినా పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను,ఉపాధ్యాయులు తమ విద్యార్థులను పుస్తకాలు చదివేలా ప్రోత్సాహించాలని, పుస్తక పఠనం పెరగడం ద్వారా మెరుగైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రముఖ ప్రచురణ సంస్థలకు చెందిన అనేక రకాల పుస్తకాలు, ప్రపంచంలో పేరుపొందిన గొప్ప రచయితల పుస్తకాలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారని, ప్రత్యేక తగ్గింపు ధరలతో వీటిని పాఠకులకు అందించడం అభినందనీయమని అన్నారు. పుస్తక ప్రియులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….