
– జీహెచ్ఎంసీలో అనువణువూ తనిఖీ
– డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో సీజన్ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో పారిశుధ్యంపై దృష్టి సారించారు. ఇళ్లలోని వాతావరణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పటి వరకు 2 శాతం ఇళ్లలో దోమల లార్వా కనిపించింది. డ్రమ్ములు, కంటెయినర్లలో 0.5 శాతం లార్వా ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి చుట్టూ నీటి నిల్వ లేకుండా చూడడం, అవసరాలకు నీరు నిల్వ చేసే డ్రమ్ములపై మూతలు ఉండేలా చూడాలని సిబ్బంది పౌరులకు వివరిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 34,45,357 ఇళ్లను (ఒక్కో ఇంటిని రెండు, మూడు పర్యాయాలు) తనిఖీ చేయగా లార్వా ఉన్న ఇళ్లు 52 వేలకు పైగా ఉన్నాయని బల్దియా పేర్కొంది. 1700లకుపైగా పాఠశాలలు, 320 కళాశాలల్లో పిల్లలకు దోమల నివారణపై అవగాహన కల్పించారు. నగరంలో దోమకాటు వ్యాధులు ప్రబలకుండా చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షిస్తున్నారు. 15,500 కాలనీల్లో ఏఎల్ఓ చేపట్టినట్టు తెలిపారు.
ఇలా అయితే ఎలా..?
నగరంలో పేరుకుపోతున్న చెత్తకుప్పలు, పారిశుధ్య లోపంతోపై సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సీరియస్ అయ్యారు. పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. బాగ్లింగంపల్లికి వెళ్లిన ఆయన అక్కడి పారిశుధ్య నిర్వహణను తనిఖీ చేశారు. యాంటీ లార్వల్ ఆపరేషన్ జరుగుతోన్న తీరును పరిశీలించారు. చెత్త సేకరణ కేంద్రాలను కూడా పరిశీలించిన ఆయన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
……………………………………..