
* తవ్వే కొద్దీ మద్యం బాటిళ్లు..
* స్థానిక ఎన్నికల్లో పంచేందుకేనా?
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తయారీ.. దాస్తున్న తీరును చూసి పోలీసులే అవాక్కయ్యారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు కల్తీగాళ్లు పంట పొలాల్లో గుంతలు తీసి దాచారు. ఎక్స్ కవేటర్లతో తవ్వకాలను చేపట్టి కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెలికి తీశారు. ఇప్పటివరకు రూ. 22.50 లక్షల నకిలీ మద్యం నిల్వలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురంలోని పంట పొలాల్లో వీటిని దాచారు. ఈరోజు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు చేయనున్నారు ఎక్సైజ్ పోలీసులు. త్వరలో జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖరీదైన బ్రాండ్ల స్టిక్కర్లు ఉన్న బాటిళ్లలో నకిలీ మద్యం నింపి.. ఓటుకు బాటిల్ పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కుట్ర పన్నుతున్నల్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కృష్ణ ఫార్మా నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొని.. తెలంగాణ సరిహద్దుల్లో కల్తీ విస్కీని తయారు చేశారు. ఏదో కొన్ని బ్రాండ్లే కాదు.. ఏకంగా 178 బ్రాండ్లనే కల్తీ చేశారు. ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఏపీలోని పలు ప్రాంతాలకు సరఫరా చేసింది. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లెలో మద్యం షాపు తనిఖీల్లో కల్తీ మద్యం బయటపడింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ రాకెట్ గుట్టు రట్టయింది.
…………………………………….