* కన్నీళ్లు దిగమింగుతూ పరీక్షకు..
*తండ్రి పాడె మోయాల్సిన చేత్తోనే విద్యార్థి పరీక్ష!
ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి : ఒకవైపు కన్నతండ్రి మృతదేహం కళ్లముందే ఉంది.. గుండె కోతతో ఆ ఇల్లంతా రోదనలు మిన్నంటుతున్నాయి. కానీ, తన తండ్రి కన్న కలలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని భావించిన ఆ విద్యార్థి, కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికుల కళ్లను చెమర్చింది.
వివరాల్లోకి వెళ్తే..
మోత్కూరుకు చెందిన కూరెళ్ళ ఎల్లయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమారుడు హర్షవర్ధన్ పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ప్రయోజకుడు కావాలని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు. అయితే, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్లయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఉన్నట్టుండి ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
నాన్న కల కోసం..
తండ్రి మరణవార్త విన్న హర్షవర్ధన్ కుప్పకూలిపోయాడు. గురువారం ఉదయం తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉంది. కానీ అదే రోజు హర్షవర్ధన్‌కు పదవ తరగతి వార్షిక పరీక్ష ఉంది. ఒకవైపు తండ్రి భౌతిక కాయం.. మరోవైపు తన భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని ఓదార్చి, “నాన్న ఆశయం నెరవేరాలంటే నువ్వు పరీక్ష రాయాలి” అని ధైర్యం చెప్పారు.
దీంతో గుండె నిండా శోకాన్ని దాచుకుని, తండ్రి పాడె మోయాల్సిన చేత్తోనే కలం పట్టి పరీక్ష రాసేందుకు హర్షవర్ధన్ సిద్ధమయ్యాడు. పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసి తిరిగి వచ్చిన అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
కదిలించిన హర్షవర్ధన్ ధైర్యం…
పరీక్షా కేంద్రం వద్ద హర్షవర్ధన్ పరిస్థితిని చూసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. అపారమైన దుఃఖంలోనూ క్రమశిక్షణతో పరీక్షకు హాజరైన ఆ బాలుడి ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఎల్లయ్యకు, ఆయన కుమారుడు పరీక్ష రాసి గొప్ప నివాళి అర్పించాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
