
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార, వ్యవసాయ, డిఆర్డీఏ, తూనికలు కొలతలు, కార్మిక శాఖల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఏసిఎస్, ఐకెపికి కేటాయించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని సూచించారు. ఏ గ్రేడ్ రకానికి 2320, బి గ్రేడ్ రకానికి 2300 మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం కొనుగోలు కేంద్రాలు మహిళా సమాఖ్యలకు కేటాయించాలని తెలిపారు. ఎంపిక చేసిన గ్రామ సమాఖ్యలకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పనకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాల్లో పాటించాల్సిన నియమ, నిబంధనల యొక్క బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు నగదు చెల్లింపు కొరకు కొనుగోలు వివరాలు ఎప్పటి కపుడు ట్యాబ్‌లలో నమోదులు చేయాలని కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ కొరకు షామియానా, తాగునీరు, ప్యాడి క్లీనర్, మాయిశ్చర్స్, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం విడి విడిగా కొనుగోలు చేయాలని, గుర్తించడానికి వీలుగా మార్కింగ్ చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లింపు ఉంటుందని తెలిపారు. అన్ని కేంద్రాల వివరాలు యాప్ లో రిజిస్టర్ చేయాలన్నారు. ధాన్యం వచ్చిన సెంటర్లలో ఏఈఓలచే టోకెన్ తీసుకొని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
……………………………………