* అడ్డుకున్న వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపు
* నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
* మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా ఆత్మహత్య
* ఆత్మహత్యపై కుటుంబసభ్యుల అనుమానాలు
* ఏపీలోని తునిలో ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : తాత నంటూనే వయస్సు తేడా మరిచి పశువులా ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలి వయసున్న బాలిక పై ఓ ప్రబుద్దుడు అత్యాచారానికి యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామాంధులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ.. వివరాల్లోకి వెళితే. కాకినాడ జిల్లాలోని తుని మండలం కొండవారపేటకు చెందిన బాలిక గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి లేకపోవడంతో తల్లి పోషణలో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణ రావుకు ఆ కుటుంబంతో పరిచయం ఉంది. ఈ క్రమంలో బాలిక చదువుతున్న గురుకుల పాఠశాలకు వెళ్లి బాలిక తాతనుంటూ పాఠశాల సిబ్బందిని నమ్మించాడు. బాలికకు ఆరోగ్యం బాగా లేదని ఇంజక్షన్ ఇప్పించాలని గురుకుల ఉపాధ్యాయులను నమ్మించి బాలికను బయటకు తీసుకువచ్చాడు.తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి బాలికను తీసుకెళ్లాడు.బాలికపై అత్యాచార యత్నం చేస్తున్న క్రమంలో తోటలో ఉన్న కాపలాదారు అడ్డగించాడు. అడ్డగించిన కాపలాదారునే నారాయణ రావు బెదిరించే ప్రయత్నం చేశాడు. తాను టీడీపీ నేతను కౌన్సిలర్ ను అని పైగా తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడను నా జోలికి వస్తే ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేస్ పెడతానంటూ కాపలాదారుడిని బెదిరించాడు. దీంతో కాపలాదారు తెలిసిన వారి ద్వారా బాలిక తల్లికి సమాచారం అందించాడు. ఈ లోగా తాటిక నారాయణ రావు బాలికను ఏమీ ఎరగనట్లు గురుకుల పాఠశాలలో వదిలేసి గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే విషయం తెల్సుకున్న స్థానికులు నారాయణ రావు కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విషయం వైరల్ కావడంతో ఐసీడీఎస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు,పోలీసులు బాలిక వద్ద సమాచారం సేకరించారు. పాఠశాల వద్ద వైసీపీ నేతలు, దళిత సంఘాల నేతలు, విద్యార్థులు నారాయణ రావును కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు నారాయణ రావుపై కిడ్నాప్ కేసుతో పాటు,ఫోక్సో కేసు నమోదు చేస్తున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నారాయణ రావును మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తుండగా టాయిలెట్ వస్తోందని పోలీసు వాహనం దిగి సమీపంలో ఉన్న చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి కావడంతో మృతదేహం తీయడానికి సాధ్యం కాలేదు. గురువారం ఉదయం నారాయణ రావు మృతదేహాన్ని పోలీసులు గజ ఈత గాళ్ల సహాయంతో వెలికితీశారు.
కుటుంబసభ్యుల అనుమానాలు
నారాయణ రావు మృతిపై నారాయణ రావు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి సమయంలో నారాయణ రావును రిమాండ్ కు తరలిస్తున్నామని సంతకాలు కావాలంటూ తమ ఇంటికి పోలీసులు వచ్చారని మళ్లీ అదే సమయంలో నారాయణ రావు చెరువులో దూకి నట్టుగా పోలీసులు చెప్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నారాయణ రావు తరలిస్తున్న సమయంలో రహదారిపై ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
