- అక్రమ మద్యం తయారికి అవకాశమున్న 8 జిల్లాలను గుర్తించాం
- ఓటర్లకు పంచేందుకు వస్తువులను నిల్వ ఉంచే గోదాములను గుర్తించాం
- సరిహద్దు రాష్ట్రాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్లు
- తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి
- ఆకేరు న్యూస్, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలి. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవిన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఏవిధంగానైతే పనిచేసారో అదే స్పూర్తితో రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు., ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
- ప్రత్యేక కంట్రోల్ రూమ్లు
ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ వివిధ శాఖల ల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులుండగా, 9 అంతర్రాష్ట్ర చెక్-పోస్ట్ లున్నాయని అన్నారు. ఇప్పటివరకు పోలీస్ శాఖ ద్వారా పదికోట్ల రూపాయలను స్వాధీన పర్చుకోవడంతోపాటు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా స్వాదీన పర్చుకున్నామని తెలిపారు. రవాణా శాఖ ద్వారా 15 చెక్ పోస్టులు, 52 ఎన్ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ చెక్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు. రవాణా శాఖ బృందాలు జరిపిన తనిఖీ లలో రూ. 34 .31 లక్షలను స్వాధీన పర్చుకున్నామని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 16 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం తోపాటు 31 స్ట్రాటెజిక్ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వీటితోపాటు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను పంచేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. వీటితోపాటు, 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ గోదాములపై కూడా నిఘా ఉంచామని అన్నారు. - ఆ ఎనిమిది జిల్లాలపై ప్రత్యేక నజర్
ఎక్సయిజ్ శాఖ ద్వారా 21 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, ఆరు మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న ఎనిమిది జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించామని సి.ఎస్ తెలియచేసారు. మద్యం అక్రమ రావాణా కు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీన పరుచుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలపై ప్రత్యేక నిఘా ఉంచామని, సి.సి టీవీలను ఏర్పాటు చేసి డిస్టిలరీస్ ద్వారా మద్యం సరఫరాను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లోని పోలీస్ శాఖకు చెందిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కూడా మద్యం రవాణాపై సి.సి టీవీ ల ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. అటవీ శాఖ ద్వారా కూడా 65 చెక్ పోస్టులు ఏర్పాటు కాగా దీనిలో 18 అంతర్ రాష్ట్ర చెక్ పోష్టులునున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని పటిష్టంగా అమలుచేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శాంతి కుమారి తెలిపారు. - ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ దొబ్రియల్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ టీ.కె. శ్రీదేవి, ఎక్సయిజ్ శాఖ కమీషనర్ శ్రీధర్, సమాచార పారసంబందాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
- —————–
Related Stories
November 6, 2024
November 6, 2024