108 Ambulance Snake Injection
* సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన పీఎం శివకుమార్
ఆకేరు న్యూస్, వరంగల్: సోషల్ మీడియా వేదికగా 108 అంబులెన్స్ సేవలపై జరుగుతున్న ఒక ప్రచారంపై ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ స్పందించారు. అంబులెన్సుల్లో పాముకాటు విరుగుడు ఇంజక్షన్లు (Anti-Snake Venom) అందుబాటులో ఉన్నాయంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
* వైద్యుల పర్యవేక్షణలోనే ఇవ్వాలి…
పాముకాటుకు ఇచ్చే విరుగుడు ఇంజక్షన్ అనేది చాలా సున్నితమైనదని, దీనిని కేవలం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని శివకుమార్ తెలిపారు. అవసరమైన అత్యవసర వైద్య సదుపాయాలు, ఐసీయూ (ICU) వసతి ఉన్న ఆసుపత్రుల్లోనే ఈ ఇంజక్షన్‌ను రోగులకు ఇస్తారని పేర్కొన్నారు.
* అంబులెన్సుల్లో ఎందుకు ఉంచరంటే..
ఈ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కొంతమంది రోగులలో తీవ్రమైన అలర్జీలు లేదా ప్రాణాంతక రియాక్షన్లు (Anaphylaxis) వచ్చే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. అలాంటి పరిస్థితులను అంబులెన్సు ప్రయాణంలో తట్టుకోవడం, చికిత్స చేయడం సాధ్యం కాదు కాబట్టే, భద్రతా కారణాల దృష్ట్యా 108 వాహనాల్లో ఈ మందును అందుబాటులో ఉంచరని స్పష్టం చేశారు.
“108 అత్యవసర సేవల ప్రధాన ఉద్దేశం పాముకాటుకు గురైన బాధితులకు ప్రాథమిక ప్రథమ చికిత్స అందిస్తూ, ఎంత వేగంగా వీలైతే అంత సురక్షితంగా వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమే. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి సమయాన్ని వృధా చేసుకోవద్దు” అని ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ ప్రజలను కోరారు. పాముకాటు వేసిన వెంటనే ఆందోళన చెందకుండా 108 కి సమాచారం అందించి, బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చడమే ఉత్తమమైన మార్గమని ఆయన సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
